మన తెలంగాణ/శంకర్‌పల్లి: జన్వాడ ఫామ్‌హౌస్‌లో విందుకు సం బంధించి బుధవారం రాజ్ పాకాల మోకిలా పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఇచ్చిన రెండు రోజుల గడువు ముగియడంతో బుధవారం తన న్యాయవాదులతో కలిసి వచ్చిన ఆయన ను మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల వరకు పోలీస్ స్టేషన్లో విచారించారు. నార్సింగ్ ఎసిపి రమణ గౌడ్ నేతృత్వంలో సి ఐ వీరబాబు ఆయనను విచారించారు. విందులో కొకైన్ డ్రగ్స్ తీసుకున్న విజయ్ మద్దూరి గురించి వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌కు సంబంధించి పలు కోణాల్లో ఆయనను ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం అక్కడి నుండి రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి అక్కడ గంటన్నర పాటు సోదాలు నిర్వహించారు. అయితే, అక్కడ ఎలాంటి ఆధారాలు లభ్యం కానట్లు తెలిసింది. అక్కడి నుండి మళ్లీ మోకిలా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి రాత్రి వరకు కొనసాగించారు. ఈసందర్భంగా పోలీసులు రాజ్‌పాకాల సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు ఇదివరకే నోటీసులు ఇచ్చారు.
బిఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. విందు కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. సోమవారం తమ ముందు హాజరు కావాలన్నారు. అడ్రస్ ప్రూఫ్‌లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. సోమవారం మోకిలా పిఎస్‌కు హాజరు కాకుంటే బిఎన్‌ఎస్‌ఎస్ 35 (3), (4), (5), (6) సెక్షన్ల ప్రకారం అరెస్టుకు దారితీస్తుందని పేర్కొంటూ రాజ్ పాకాలకు మోకిలా ఇన్స్‌పెక్టర్ నోటీసులు జారీ చేశారు. సోమవారం రాజ్ పాకాల తన న్యాయవాదులను పంపి సమయం కోరడంతో పాటు, అదే రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కోర్టు రెండు రోజుల సమయం ఇస్తూ పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో బుధవారం తన న్యాయవాదులతో కలిసి పోలీసుల ఎదుట హాజరై డ్రగ్స్‌ను పార్టీలో తీసుకోలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపినట్లు తెలిసింది. కాగా, రాజ్ పాకాల ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తేలడం కలకలం సృష్టించింది. అతని సన్నిహితుడు విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నారు. పార్టీలో కొకైన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు బుధవారం జరిపిన విచారణ సందర్భంగా ఆరా తీశారు.
మోకిలా పోలీస్ స్టేషన్ వద్ద బిఆర్‌ఎస్ శ్రేణులు
మాజీ మంత్రి కెటిఆర్ బావమరిది రాజ్ పాకాల మోకిలా పోలీస్ స్టేషన్ కు వస్తున్నారని తెలియడంతో బిఆర్‌ఎస్ శంకర్‌పల్లి మండల పార్టీ అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెద్ద ఎత్తున మీడియా కూడా రావటంతో మోకిలా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. హైదరాబాద్,- శంకర్‌పల్లి వెళ్లే రోడ్డుపై పోలీస్ స్టేషన్ ఉండటంతో రోడ్డు పక్కన పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి.