Friday, November 1, 2024

పదేళ్ళ విధ్వంసక పాలనలోని చీకట్లు తొలిగాయి:సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత పదేండ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు తొలగిపోయాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతోందన్న ధీమా వ్యక్తం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఈ దీపాల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా పెద్దలందరూ పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి ఇందిర సేవలు ఎనలేనివి
నా ప్రతి రక్తపు బొట్టు దేశ పటిష్టతకు తోడ్పడుతుందని ప్రకటించిన మహానీయురాలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇందిరాగాంధీ వర్థంతిని పురస్కరించుకొని ఆమె సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ దేశ సమగ్రత, సమైక్యత, పటిష్టత కోసం కఠిన నిర్ణయాలు తీసుకొని ఆమె ముందుకు సాగారని సిఎం కొనియాడారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, 20 సూత్రాల కార్యక్రమం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి ఇందిరా గాంధీ ఎంతగానో కృషి చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలనను ఆదర్శంగా తీసుకుందని, ఆ మహానీయురాలి స్పూర్తితోనే పేదల అభ్యున్నతే లక్షంగా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన చెప్పారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళి
సంస్థానాల విలీనం ద్వారా స్వతంత్ర భారత దేశ సార్వభౌమత్వానికి నిండుదనాన్ని చేకూర్చిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. స్వాతంత్ర భారత ప్రథమ ఉప ప్రధానమంత్రిగా, హోం శాఖ మంత్రిగా ఆయన చూపిన చొరవ, సమర్థతతోనే వందలాది సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. సర్దార్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News