ముంబై: వరుస ఓటములతో ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన ఆతిథ్య టీమిండియాకు శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడో టెస్టు సవాల్‌గా మారింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయినా పరువును దక్కించుకోవాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. ఇప్పటికే రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. చివరి టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ చాలా బలంగా ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. భారత్ మాత్రం వరుస పరాజయాలతో డీలా పడిపోయింది. ఇలాంటి స్థితిలో తిరిగి గాడిలో పడాలంటే చివరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలువాలంటే కూడా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన స్థితి భారత్‌కు ఏర్పడింది.
రోహిత్ ఈసారైనా..
తొలి రెండు టెస్టుల్లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ కనీసం చివరి మ్యాచ్‌లోనైనా జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. రోహిత్ వైఫల్యం జట్టుకు సమస్యగా మారింది. రానున్న ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో రోహిత్ గాడిలో పడక తప్పదు. యశస్వి జైస్వాల్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. కానీ రోహిత్ విఫలమవుతుండడంతో భారత్‌కు తొలి రెండు టెస్టుల్లో శుభారంభం లభించలేదు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మెరుగ్గా ఆడక తప్పదు. ఇక సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా జట్టుకు కీలకంగా మారాడు. కోహ్లి తొలి రెండు టెస్టుల్లో విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా తయారైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే భారత్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి.
కానీ కోహ్లి చెత్త బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. ఒకప్పుడూ అద్భుత బ్యాటింగ్ ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లను హడలెత్తించిన కోహ్లి కొంత కాలంగా అనామక బౌలర్లను సయితం దీటుగా ఎదుర్కొలేక పోతున్నాడు. రానున్న ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో కోహ్లి ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరం జట్టుకు ఎంతైనా ఉంది. శుభ్‌మన్ గిల్ కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. గిల్ విజృంభిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చే సత్తా గిల్ సొంతం.
ఈ మ్యాచ్‌లో అతను జట్టుకు చాలా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రిషబ్ పంత్, అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్, జడేజా తదితరులు కూడా తమ తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే భారత్ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కాగా, ఈ మ్యాచ్‌లో యువ బౌలర్ హర్షిత్ రాణాను బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తోంది. రానున్న ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో అతన్ని పరీక్షించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే రాణా ఆరంగేట్రం చేయడం ఖాయం. బుమ్రా, అశ్విన్, జడేజా, సుందర్ తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. బ్యాటర్లు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత్‌కు అసాధ్యమేమీ కాదు.
హ్యాట్రిక్ గెలుపు కోసం..
మరోవైపు ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. చివరి టెస్టులోనూ గెలిచి భారత గడ్డపై నయా చరిత్ర లిఖించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా ఉంది. కాన్వే, లాథమ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిఛెల్, ఫిలిప్స్, బ్లుండెల్, సాంట్నర్ తదితరులతో కివీస్ బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేగాక బౌలింగ్‌లోనూ జట్టు బలంగా ఉంది. సాంట్నర్, సౌథి, హెన్రి, ఎజాజ్ పటేల్, ఓ రౌర్కీ, ఫిలిప్స్‌లతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా కివీస్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.