Monday, December 23, 2024

రాజుకున్న హర్యానా ఎన్నికల వివాదం

- Advertisement -
- Advertisement -

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాల ఆరోపణల అంశం ఇప్పుడు పూర్తిగా వివాదాస్పదం అయింది. తాము ఎన్నికల సంఘాన్ని అవసరం అయితే కోర్టుకు లాగుతామని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం హెచ్చరించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ప్రత్యేకించి కౌంటింగ్‌పై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. అయితే కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం అనుచితంగా స్పందించిందని పేర్కొంటూ పార్టీ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. తప్పిదాలు జరిగితే చక్కదిద్దండని తాము కోరితే, ఇందుకు ప్రతిగా ఎన్నికల సంఘం తమ పార్టీపై మండిపడిందని, పైగా పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలకు దిగిందని , ఇదేం న్యాయం అని పార్టీ ప్రశ్నించింది.

ఈ పరిణామాలపై తాము చూస్తూ ఊరుకునేది లేదని, కోర్టుకు వెళ్లుతామని , పార్టీపై పరుష పదజాలం వ్యాఖ్యల ఉపసంహరణకు పిటిషన్ వేస్తామని శుక్రవారం పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల సంఘానికి పార్టీ తరఫున పంపించిన లేఖపై కెసి వేణుగోపాల్, అశోక్ గెహ్లోట్, అజయ్ మకెన్ వంటి మొత్తం తొమ్మండుగురు నేతలు సంతకాలు చేశారు. తాము ఎన్నికల అక్రమాలపై ఇసికి తెలియచేసిన సమాచారం బహిరంగం చేయరాదని. ఇదది కేవలం ఇసి కార్యాలయానికి, ఎన్నికల ప్రధాన కమిషనరు, కమిషనర్లకు ఉద్ధేశించిన విషయం అని గుర్తు చేశారు.

ఇసి అధికార దర్పం తగదు
తాము ఇసి గౌరవ మర్యాదలను పరిగణనలోకి తీసుకునే సమాచారం పంపించామని, అయితే దీనికి బదులుగా తమకు ఇసి నుంచి అధికార దర్పపు ప్రత్యుత్తరం అందిందని , ఇదేం పద్ధతి అని పారీ ప్రశ్నించింది. ఎన్నికల సంఘం అంటే దేశంలో ఇప్పటికీ అవశేషంగా మిగిలిన ఒక తటస్థ సంస్థ అని, అయితే ఇప్పటి ఎన్నికల సంఘం వైఖరి, లక్షం పూర్తిగా ఈ ముద్రను కూడా చెరిపేసేదిగా ఉందని పార్టీ తమ లేఖలో పేర్కొంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ విజయం ఖాయం అని కాంగ్రెస్ భావిస్తూ వచ్చింది. పలు ఎగ్జిట్ పోల్ సర్వేలలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే ఇక్కడ తిరిగి బిజెపి గెలిచింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ తీవ్ర స్థాయి ఆరోపణలకు దిగింది. దీనిపై ఫిర్యాదు కూడా వెలువరించింది. దీనికి ఇటీవలే ఎన్నికల సంఘం నుంచి పార్టీకి ఘాటైన సమాధానం అందింది.

ఓడినప్పుడు నిందలేస్తే ఎట్లా పార్టీని కడిగేసిన ఇసి
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నిరాధార ఆరోపణలకు దిగుతోందని , అపజయాల ఫలితం వెలువడినప్పుడు తిట్టిపోయడం కాంగ్రెస్ తంతు అయిందని చురకలకు దిగారు. ఎన్నికల సంఘం పనితీరును తప్పుపడుతూ అనుచిత , నిరాధార కేవలం సంచలనాత్మక విమర్శలకు దిగడం వల్ల ఫలితం ఉండదని కూడా ఇసి ఉన్నత స్థాయి వర్గాలు స్పందించాయి. ఇది నిజంగానే కాంగ్రెస్ , ఇసి నడుమ దీపావళి మతాబులు పేలిన తంతుగా మారింది. కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కానీ బాధ్యతారహిత ఆరోపణలకు దిగడం వల్ల పరువు ఎవరిది దెబ్బతింటుందో గ్రహించడం మంచిదని కూడా ఇసి ఘాటుగా వ్యాఖ్యానించింది. హర్యానాలో ఎన్నికల ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా , అంతా సవ్యంగా జరిగిందని కూడా స్పష్టం చేశారు.

దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ ఇసి వైఖరి తమకు అనూహ్యం ఏదీ కాదని, తాము ఏమి విస్తుపోలేదని, తనకు తాను క్లీన్‌చిట్ ఇచ్చుకుంటూ వస్తోందని విమర్శించారు. ఇసి వైఖరి తెలిసి తాము సాధారణంగా ఇటీవలి కాలంలో పెద్దగా స్పందించడం లేదని, అయితే కీలక ప్రజాస్వామిక వ్యవస్థ పెద్దలు కనబర్చిన వైఖరి గమనించి తాము తగు విధంగా స్పందించాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఇప్పుడు ఎదురుదాడికి దిగింది. ఎన్నికల సంఘం తీరు ఇప్పుడు చివరికి అభ్యంతరకర , అసాధారణ స్థాయిని కూడా దాటిందని , పార్టీలు వ్యక్తం చేసిన విషయాలపై తగు విధంగా స్పందించాల్సిన సంఘం , ఇప్పుడు వ్యవహరించిన తీరు బాధ్యతలను దాటి మరో విధమైన స్థాయికి చేరుకుందని విమర్శించారు.

ఇక వదిలే ప్రసక్తే లేదు
ఇటీవలి కాలంలో ఇసి నుంచి కాంగ్రెస్ పట్ల , పార్టీ నేతల పట్ల వ్యక్తం అవుతున్న వైఖరి దారుణంగా ఉంటోంది. ఇక దీనిని తాము తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు స్పందించాయి. పార్టీపైనా , వ్యక్తిగతంగా నేతలపైనా పేర్లు పెట్టి విమర్శలకు దిగడం ఉన్నత స్థాయి సంస్థకు గౌరవం ఆపాదించదని స్పందించారు. ఓ వైపు తాము కేవలం తమ ముందుకు వచ్చిన సమస్య గురించి పద్ధతి ప్రకారం చెప్పడం జరిగితే, ఇందుకు ప్రతిగా అటువైపు నుంచి దూషణల తరహా వైఖరి కనబడుతోందని విమర్శించారు. గత నెల 8వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు తొలుత కాంగ్రెస్ ఆధిక్యత కనబడింది.

తరువాత దశలో బిజెపి 48 స్థానాలలో గెలుపుతో వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకుంది.ఎటువంటి వివరణ లేకుండానే పలితాలను జాప్యంచేస్తూ ప్రకటించడం జరిగిందని , ఫలితాల తారుమారు అనుమానాలు ఉన్నాయని పార్టీ ఆరోపించింది. తాము ఎన్నికల ఫలితాలను ఆమోదించబోమని , ఇవి అనూహ్యం , ఆశ్చర్యకరం , అసహజం అని , ఓ పార్టీకి ఉద్ధేశపూరితంగానే విజయం కట్టబెట్టారని , ప్రజా తీర్పును తొక్కిపెట్టారని , ప్రజాస్వామిక విధానాలకు, పారదర్శకతకు గండిపడిందని, హర్యానా అధ్యాయం ముగియలేదని అప్పట్లో సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. ఎన్నికల సంఘానికి ఇప్పుడు ఘాటు లేఖ పంపించిన నేతలలో ఆయన కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News