Saturday, November 23, 2024

అంగుళం భూమి వదులుకోం

- Advertisement -
- Advertisement -

భారత్ తన సరిహద్దులపై ఒక్క ‘అంగుళం’ మేర కూడా రాజీ పడజాలదని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం విస్పష్ట ప్రకటన చేశారు. దేశాన్ని రక్షించేందుకు మన సాయుధ దళాల బలంపై ప్రజలకు విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. గుజరాత్ కచ్ జిల్లాలో సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలాను సందర్శించిన సందర్భంగా ఒక కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, భారతీయ సాయుధ బలగాలను చూసినప్పుడు భారత శత్రువులు ‘తమ దురాలోచనల ముగింపు’ను చూస్తారని అన్నారు. దీపావళి పర్వదినాన్ని సాయుధ దళాల సిబ్బందితో కలసి జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధాని మోడీ పాటించారు. ఆ ప్రదేశం భారత్‌పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్నది. మోడీ బిఎస్‌ఎఫ్, త్రివిధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘గతంలో ఈ ప్రాంతాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చే యత్నాలు జరిగాయి.

సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంపై శత్రువు కన్ను పడింది. కానీ దేశాన్ని మీరు కాపాడుతున్నందున మేము కలవరపడడం లేదు. మన శత్రువుకు ఈ సంగతి బాగా తెలుసు’ అని మోడీ ఉద్ఘాటించారు. ‘మీ కారణంగానే తమ దేశం భద్రంగా ఉందని భారత ప్రజలు భావిస్తుంటారు, ప్రపంచం మిమ్మల్ని చూసినప్పుడు భారత శక్తిని చూస్తుంది, శత్రువులు మిమ్మల్ని చూసినప్పుడు తమ దుర్వూహాల ముగింపును చూస్తాయి’ అని చెప్పారు. ‘దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం మేర కూడా రాజీ పడజాలని ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ఉన్నది’ అని ప్రధాని స్పష్టం చేశారు. శత్రువు ‘దౌత్యం పేరిట’ సర్ క్రీక్‌ను కైవసం చేసుకునేందుకు గతంలో ప్రయత్నాలు చేసిందని, కానీ అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను అటువంటి యత్నాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడానని తెలిపారు. తన ప్రభుత్వం దేశ పరిరక్షణకు సైన్యం శక్తిని విశ్వసిస్తున్నదని, దేశ శత్రువుల మాటలపై ఆధారపడదని కూడా మోడీ చెప్పారు.

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) పొడుగునా నాలుగు సంవత్సరాలకు పైగా సాగిన ప్రతిష్టంభన అంతానికి భారత్, చైనా ఒక ఒప్పందం కుదుర్చుకోవడంతో తూర్పు లడఖ్‌లోని దెమ్‌చోక్, దెప్సాంగ్ మైదాన ప్రాంతాల్లోని రెండు ఘర్షణ ప్రదేశాల నుంచి రెండు దేశాల సేనలు ఈ వారంలో ఉపసంహరిచుకున్న సంగతి విదితమే. సాయుధ దళాలకు అత్యాధునిక ఆయుధ సామగ్రి సరఫరా చేయడానికి, వారిని ప్రపంచంలోని అత్యంత అధునాతన మిలిటరీల్లో ఒకటిగా మార్చడానికి తన ప్రభుత్వం కృషి చేస్తున్నదని మోడీ తెలిపారు. ‘ఇది నవ తరం యుద్ధతంత్ర శకం. అందుకు ఒక ఉదాహరణ డ్రోన్ టెక్నాలజీ. ప్రస్తుతం యుద్ధం చేస్తున్న దేశాలు వివిధ అవసరాలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. సాయుధ దళాలలోని మూడు విభాగాలకూ ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేస్తున్నాం’ అని ప్రధాని తెలియజేశారు. పలు భారతీయ సంస్థలు కూడా డ్రోన్లను తయారు చేస్తున్నాయని మోడీ తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ లక్షం దిశగా దేశం వేగంగా సాగుతున్నందున ‘మీరంతా ఈ కల పరిరక్షకులు’ అని మోడీ జవాన్లతో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News