ప్రాంతీయ సినిమా హద్దులు దాటి పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిన స్టార్ హీరోస్ చాలా కొద్దిమందే కనిపిస్తారు. తన బ్లాక్‌బస్టర్ సినిమాలు, రికార్డ్ బాక్సాఫీస్ వసూళ్లతో వారిలో ముందు నిలుస్తున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా ప్రయాణం కల్కి మూవీతో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ స్టార్ హీరో సినిమాలు బాలీవుడ్ స్టార్స్‌తో పోటీ పడేంతగా నార్త్‌లో కలెక్షన్స్ సాధిస్తున్నాయి. బాలీవుడ్లో తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తున్నారు ప్రభాస్. తమిళ, మలయాళ, కన్నడలోనూ స్థానిక స్టార్ హీరోలతో ప్రభాస్ సినిమాలు పోటీ పడటం నిజమైన పాన్ ఇండియా ట్రెండ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ఓవర్సీస్ లోనూ ప్రభాస్ ఆకర్షణకు తిరుగులేదు.
ఆయన సలార్, కల్కి సినిమాలు ఓవర్సీస్లో వసూళ్ల చరిత్ర సృష్టించాయి. డిజిటల్ మార్కెట్ లో హిందీ, స్థానికంగా హక్కుల్ని తీసుకునే ట్రెండ్ ప్రభాస్ సినిమాలతో మరింతగా పెరిగింది. సలార్ హిందీ వర్షన్ హాట్ స్టార్ తీసుకోగా, స్థానిక భాషల హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. కల్కి సినిమా హిందీ హక్కులను నెట్ ఫ్లిక్స్ తీసుకోగా, ప్రైమ్ వీడియో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హక్కులను కొనుగోలు చేసింది. ఇలా థియేట్రికల్, ఓటీటీ, ఇతర బిజినెస్‌ల ద్వారా ప్రభాస్ సినిమాలు నిర్మాణ వ్యయానికి ఎన్నో రెట్ల లాభాలు ఆర్జిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం తన ప్రాంఛైజీ సినిమాలతో భారీ పాన్ వరల్డ్ లైనప్ చేసుకున్నారు. ఆయన సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి.