Friday, November 22, 2024

ఈశాన్య లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..52 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఈశాన్య లెబనాన్‌పై ఇజ్రాయెల్ శుక్రవారం సాగించిన వైమానిక దాడుల్లో 52 మంది మృతి చెందారు. 72 మంది గాయపడ్డారు.సెంట్రల్ గాజా లోని గురువారం నుంచి ప్రారంభమైన ఈ దాడుల్లో పాలస్తీనియన్లు 25 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బైడెన్ ప్రభుత్వం తాత్కాలికంగా యుద్ధం నిలుపుదలకు మళ్లీ దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రారంభించిన తరుణంలో ఈ దాడులు జరగడం గమనార్హం. మరోవైపు దక్షిణ బీరుట్ లోని దహియేలో కూడా భవనాలు ధ్వసమైనప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా రాకెట్ చేసిన దాడుల్లో 11 మంది గాయపడినట్టు అక్కడి వార్తాసంస్థలు వెల్లడించాయి.

మరో హమాస్ నేత హతం
హమాస్‌కు చెందిన సీనియర్ అధికారి ఇజ్ అల్ దిన్ కసబ్‌ను హతమార్చినట్టు ఐడీఎఫ్ వెల్లడించింది. ఎన్‌క్లేవ్‌లో తమ కారుపై టెల్‌అవీవ్ జరిపిన దాడుల్లో అమాన్ అయేష్ అనే హమాస్ అధికారితోపాటు కసబ్ మృతి చెందినట్టు వెల్లడించింది. గాజా స్ట్రిప్ లోని ఇతర సమూహాలను కసబ్ సమన్వయం చేయడానికి బాధ్యత వహిస్తుంటాడని తెలిపింది. కసబ్ మరణాన్ని హమాస్ ధ్రువీకరించింది. కసబ్ మరణానికి పాలస్తీనా అధికారులు సంతాపం తెలిపారు. నుసైరత్ శరణార్థుల శిబిరం సమీపాన హమాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, మిలిటెంట్ ఆపరేటింగ్‌ను టార్గెట్ చేసుకుని దాడులు సాగించామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ దాడుల్లో 21 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అమెరికా దౌత్యవేత్తలు శుక్రవారం ఇజ్రాయెల్ అధికారులతో లెబనాన్ లేదా గాజా నుంచి యుద్ధం తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ చర్చలు జరిపారు కానీ ఎలాంటి సంకేతాలు వెలువడ లేదు.

శుక్రవారం హమాస్ తమ సుదీర్ఘకాల డిమాండ్లను రెట్టింపు చేసింది. యుద్ధాన్ని శాశ్వతంగా నిలిపివేయాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా వైదొలగాలని డిమాండ్ చేసింది. కానీ ఇజ్రాయెల్ తాత్కాలికంగా యుద్దం నిలుపుదల చేస్తామని చెప్పింది. ఇవన్నీ పాలస్తీనా ప్రజల భద్రత, సుస్థిరత, పునరావాసం, పునర్నిర్మాణం తదితర సమగ్ర అవసరాలు తీరవని, హమాస్ సీనియర్ అధికారి బస్సేం నయీమ్ హమాస్ అధికారిక ఛానెల్‌లో వెల్లడించారు. ఉత్తర గాజాలో హమాస్ మిలిటెంట్లు మళ్లీ సమావేశమవుతున్నారన్న సాకుతో ఇజ్రాయెల్ దళాలు మళ్లీ దాడులు ముమ్మరం చేస్తుండటంతో వేలాది మంది ప్రజలకు తగినంత ఆహారం, నీరు అందడం లేదు. శనివారం నుంచి అత్యవసర పోలియో వ్యాక్సిన్ క్యాంపైన్ మళ్లీ ప్రారంభిస్తామని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించినా ఒక్క గాజా సిటీ తప్ప మిగతా ప్రాంతాలకు వెళ్లడానికి అనుసంధానం ఏర్పడలేదు. ఇజ్రాయెల్ ముట్టడి కట్టుదిట్టం చేయడంతో జాబాలియా, బెయిట్ లహియా, బెయిట్ హనోన్ , ప్రాంతాలు దిగ్బంధం లోనే ఉన్నాయి. ఉత్తర గాజాలో బాధితులకు ఎలాంటి సాయం అందడం లేదని ఐక్యరాజ్యసమితా , ఇతర మానవతా సహాయం సంస్థలు శుక్రవారం హెచ్చరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News