Sunday, November 24, 2024

తీరు మారని కెనడా

- Advertisement -
- Advertisement -

భారత్‌తో దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నా కెనడా తీరు ఏమీ మారడం లేదు. ఆ దేశం మరొకసారి పేట్రేగిపోయింది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గురించి కెనడా మంత్రి ఒకరు చేసిన ప్రస్తావనలను తాము నిర్దంద్వంగా ఆక్షేపిస్తున్నట్లు భారత్ శనివారం వెల్లడించింది. అటువంటి ‘అసంబద్ధ, నిరాధార’ అరోపణలు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర విపరిణామాలకు దారి తీస్తాయని భారత్ హెచ్చరించింది. కెనడా లోపల సిక్కు వేర్పాటువాదులు లక్షంగా దౌర్జన్యకాండ, బెదరింపులు, నిఘా సమాచారం సేకరణ కార్యక్రమాన్ని అమిత్ షా ఆదేశించినట్లు కెనడా విదేశాంగ శాఖ ఉప మంత్రి డేవిడ్ మోరిసన్ మంగళవారం ఆరోపించిన తరువాత విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ ఆరోపణలపై ముందుగా వార్త రాసిన ‘ది వాషింగ్టన్ పోస్ట్’కు అమిత్ షా పేరును తాను ధ్రువీకరించినట్లు కూడా మోరిసన్ కెనడా జాతీయ భద్రత కమిటీలోని పార్లమెంట్ సభ్యులతో చెప్పారు.

భారత్‌ను అపఖ్యాతి పాల్జేయడానికి, ఇతర దేశాలను ప్రభావితం చేయడానికి ఒక ప్రత్యేక వ్యూహంలో భాగంగానే అంతర్జాతీయ మీడియాకు కెనడా ప్రభుత్వ ఉన్నత అధికారులు నిరాధారమైన ఆరోపణలను ఉద్దేశపూర్వకంగానే లీక్ చేశారన్న తాజా సమాచారం ప్రస్తుత కెనడా ప్రభుత్వ రాజకీయ అజెండా, వ్యవహరణ తీరు గురించి భారత ప్రభుత్వానికి చాలా కాలంగా గల అభిప్రాయాన్ని నిర్ధారిస్తోందని ఎంఇఎ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ చెప్పారు. ఢిల్లీలో వారం వారీ మీడియా సమావేశంలో ప్రశ్నలకు జైశ్వాల్ సమాధానం ఇస్తూ, అటువంటి బాధ్యతరహిత చర్యలు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర పరిణామాలకు దారి తీయగలవని హెచ్చరించారు. భారత్ శుక్రవారం కెనడా హైకమిషన్ ప్రతినిధికి సమన్ జారీ చేసిందని, భారత హోమ్ శాఖ మంత్రి గురించి కెనడా ఉప మంత్రి చేసిన ‘అసంబద్ధ, నిరాధార’ ప్రస్తావనలను తీవ్రంగా నిరసిస్తూ ఒక డౌత్య నోట్‌ను అందజేసిందని జైశ్వాల్ తెలియజేశారు. మోరిసన్ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు అమిత్ షా ఆరోపిత ప్రమేయం గురించి కెనడాకు ఎలా తెలిసిందో చెప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News