Friday, November 22, 2024

శ్రీనగర్ ఉగ్ర నిరోధక చర్యలో బిస్కట్ల కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్‌లో ఒక ఉన్నత స్థాయి ఉగ్ర కమాండర్‌ను మట్టుబెట్టడానికి దారి తీసిన జయప్రదమైన ఉగ్ర నిరోధక కార్యక్రమంలో వ్యూహాత్మక ప్రణాళికే కాకుండా సంప్రదాయేతర పరిష్కారం బిస్కట్లు కూడా కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్ కేంద్రంగా గల ఉగ్ర సంస్థ లష్కర్ ఎ తయ్యిబా కమాండర్ ఉస్మాన్‌పై సాగిన ఆ కార్యక్రమంలో వీధి కుక్కల వల్ల ఎదురైన సమస్యను అధిగమించడంలో బిస్కట్ల ప్రాముఖ్యాన్ని సీనియర్ అధికారులు ప్రధానంగా ప్రస్తావించారు. శ్రీనగర్‌లో జనసమ్మర్దం అధికంగా గల ఖన్యార్ ప్రాంతంలో శనివారం రోజంతా సాగిన ఎన్‌కౌంటర్‌లో ఉస్మాన్ హతుడయ్యాడు. జెకె వేసవి రాజధాని శ్రీనగర్‌లో రెండు సంవత్సరాలకు పైగా కాలంలో అది గణనీయమైన తొలి ఎన్‌కౌంటర్ అయింది. స్థానిక పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సిఆర్‌పిఎఫ్) సంయుక్త కృషితో ఆ కార్యక్రమం సాగింది.

లోయ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన ఉస్మాన్ 2000 దశకం ఆరంభంలోని తన తొలి కార్యకలాపాల నుంచి అసంఖ్యాక ఉగ్ర దాడులకు సూత్రధారిగా గణనీయ పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌లో కొంత కాలం గడిపిన తరువాత అతను 201617 కాలంలో ఈ ప్రాంతంలోకి తిరిగి చొరబడ్డాడు. నిరుడు పోలీస్ ఇన్‌స్పెక్టర మస్రూర్ వనిని కాల్చిచంపిన ఘటనలో అతనికి పాత్ర ఉందని తెలుస్తోంది. ఒక నివాస ప్రాంతంలో ఉస్మాన్ ఉన్నాడని వేగులు సమాచారం ఇచ్చినప్పుడు పకడ్బందీగా తొమ్మిది గంటల పాటు ప్రణాళికతో సాగించిన ఆ కార్యక్రమం ఇతర విధాలైన నష్టం లేకుండా విజయవంతమైంది. అక్కడ వీధి కుక్కల ఉనికి తీవ్ర ఆందోళన కలిగించింది. వాటి అరుపులు ఉగ్రవాదిని అప్రమత్తం చేసే ప్రమాదం ఉంది. దానిని అధిగమించేందుకు అన్వేషణ బృందాలకు బిస్కట్లు సమకూర్చారు. వారు తమ లక్షం చేరుకుంటున్నప్పుడు కుక్కలను సముదాయించేందుకు బిస్కట్లు వినియోగించారు. భద్రత బలగాల మొత్తం మోహరింపును ఫజర్ (తెల్లవారు జాము ప్రార్థనల) ముందు పూర్తి చేశారు. 30 గృహాలకు భద్రత దళాలు రక్షణ వలయం ఏర్పాటు చేశారు.

ఎకె47, ఒక పిస్టల్, అసంఖ్యాక గ్రనేడ్లు కలిగి ఉన్న ఉస్మాన్ భద్రత బలగాలతో ముమ్మరంగా కాల్పుల పోరుకు దిగాడు. ఆ ఘర్షణ సమయంలో కొన్ని గ్రనేడ్లు పేలాయి. దానితో ఇంటిని అగ్నిజ్వాలలు చుట్టుముట్టాయి. మంటలు చుట్టుపట్ల కట్టడాలకు వ్యాపించకుండా చూసేందుకు భద్రత సిబ్బంది వాటిని వెంటనే చల్లార్చారు. అనేక గంటల పాటు ఉద్ధృతంగా సాగిన కాల్పుల పోరు తరువాత ఉస్మాన్‌ను మట్టుబెట్టారు. ఆ ఎన్‌కౌంటర్‌లో నలుగురు భద్రత సిబ్బంది గాయపడ్డారు. వారి పరిస్థితి స్థిరంగా ఉందని తెలుస్తోంది. ఆ ఎన్‌కౌంటర్ భద్రత బలగాలకు ముఖ్యంగా ఎల్‌ఇటి అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌టి)పై గణనీయ విజయం అయింది. టిఆర్‌టి ఇటీవలి కాలంలో స్థానికేతర కూలీలు, భద్రత సిబ్బందిని లక్షం చేసుకుంటున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News