Thursday, November 21, 2024

రైతుల ఓట్లు కావాలి… వడ్లు వద్దా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నంగునూర్: ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతుల ఓట్లు కావాలి.. కానీ వారి వడ్లు పట్టవని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా, మండల కేంద్రంలోని బద్దిపడగలో ప్రభుత్వం ఏర్పాటు చే సిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ హయాంలో వడ్లు కల్లాలకు రాకముందే సంచులు పంపించి, మిల్లులు టైయప్ చేపించి, ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాటు చేసి మరీ రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేశారన్నారు. కానీ, ఇపుడు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు దక్కడం లేదని, రేవంత్ సర్కార్ నెలరోజులైనా వడ్లు కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. కోతులు, పందికొక్కులు వడ్లను నాశనం చేస్తున్నాయని, రైతులంతా ఇంటికి వెళ్లకుండా కల్లాల కాడ కావలి కాస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల, మహబూబాబాద్, సూర్యాపేట, రాజన్న సిరిసిల్లలో రైతులంతా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులను రోడ్డుపై పడేశారని మండిపడ్డారు.

రూ.7,521లకు కొనుగోలు చేయాల్సిన పత్తిని కేవలం రూ.5000లకు రైతులు అమ్ముకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. పత్తికి మద్దతు ధర లేదని, మక్కల కొనుగోలు కేంద్రాలు లేవని, వడ్లు రూ.1800లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులు పంట పండించుకునేందుకు కష్టపడాలి, పండించిన పంటను కూడా అమ్ముకునేందుకు కష్టపడాలా అని సిఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని, వంద కారణాలు చూపించి ఇప్పటివరకు చాలామందికి రుణమాఫీ చేయలేదన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా కెసిఆర్ రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు రారన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ కొనుగోలు చేసిన ప్రభుత్వం రెండు నెలలైనా డబ్బులు ఇవ్వలేదని, దీంతో చాలామంది రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు.

సిద్దిపేట జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో వానకాలం వరి సాగైందని, 9 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి కానీ ఇప్పటివరకు అధికారులు వెయ్యి మెట్రిక్ టన్నుల వడ్లు కూడా కొనలేదన్నారు. కెసిఆర్ హయాంలో మంత్రులు, ఎంఎల్‌ఎల జీతాలు ఆపి మరీ రైతులకు రైతుబంధు డబ్బులు వేశారన్నారు. 11 సార్లు కెసిఆర్ రూ.72,815 కోట్లు రైతుబంధు డబ్బులు వేశారన్నారు. రైతులకు గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు ఇచ్చే తెలివి కూడా రేవంత్ రెడ్డికి లేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్‌ను వదిలి, కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, రూ.500 బోనస్ ఇవ్వాలని, లేకపోతే బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లింగం గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు దువ్వల మల్లయ్య, సిద్దన్నపేట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రాగుల సారయ్య, పలు గ్రామాల మాజీ సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News