Tuesday, November 5, 2024

నల్లగొండ నుండే బిసి గర్జన

- Advertisement -
- Advertisement -

బడుగులను ఏకం చేయడం.. బిసి విద్యార్థులు, యువతలో చైతన్యం కల్పించడం.. బడుగుల్లోని అన్నికులాలను కూడగట్టే దిశగా బిసి గర్జన సభ ఆదివారం నల్లగొండ జిల్లా, మిర్యాలగూడలో సాగింది. రాజకీయ చైతన్యానికి వేదికైన నల్లగొండ జిల్లానుంచే శంఖారావం పూరించారు. మిర్యాలగూడ నుంచి బిసిగర్జన సభను ప్రారంభించడం.. అధికార పార్టీ ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న రెడ్లతోపాటు అధికార పార్టీపై తిరుగుబాటు చేస్తూ కామెంట్లు చేశారు. తెలంగాణకు చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మిర్యాలగూడ చివరి ఎంఎల్‌ఎ బిఎల్‌ఆర్.. జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుటుంబాలు తప్ప పోటీ చేసే నేతల్లేరా.. అంటూ సభావేదిక నుండి మల్లన్న గర్జించారు. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గ ప్రాబల్యం ఉండటం.. రిజర్వుడ్ స్థానాలు, ఆలేరు నియోజకవర్గం మినహా అన్నింటా రెడ్లదే పెత్తనం ఉన్న నల్లగొండ జిల్లా నుంచి బిసి గర్జనకు నాంది పలికి సవాల్ విసిరారు.

ఈ వేదికపై ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్నతోపాటు శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎంఎల్‌ఎ పుట్ట మధు, మాజీఎంఎల్‌సిలు ఆకుల లలిత, పూల రవీందర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు లాంటి వక్తలు ఉన్నారు. వీరంతా బిసి నినాదం ఎత్తుకొని 56 శాతం ఉన్న బిసిలకు ఎన్నికల్లో ఎందుకు టికెట్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రెడ్డి సామాజికవర్గ ప్రాబల్యం ఉన్న నల్లగొండ నుంచే బిసిగర్జన పెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉద్ధండులైన రెడ్డిలపై ఎక్కుపెట్టి ఎంఎల్‌సి మల్లన్న మాట్లాడటంపై పెద్దఎత్తున చర్చకు దారితీసింది. అయితే అప్పుడే తీన్మార్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మల్లన్న కామెంట్లపై నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ బిఫామ్‌పై గెలిచి స్వంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘నీ గెలుపునకు మేమంతా కష్టపడ్డాం.. కానీ ముఖ్యమంత్రి, ఎంఎల్‌ఎలపై కామెంట్లు చేయడం సమంజసం కాదు’ అంటూ హితవు పలికారు. మల్లన్న వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని చెప్పుకొచ్చారు.

అయితే తీన్మార్ బిసి గర్జన.. రెడ్లపై విరుచుకుపడటంతో బిసి నినాదం ఎటువైపు వెళుతుంది.. బిసిలను కూడగట్టే క్రమంలో మొదట్లోనే పెద్దఎత్తున ఘాటైన విమర్శలు చేస్తే తట్టుకోవడం ఎలా? అని కొంతమంది మదనపడుతున్నారు. బిసి సామాజికవర్గంలో చైతన్యం తీసుకువస్తూ క్రమంగా పుంజుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే అధికార పార్టీ ఎంఎల్‌సిగా ఉంటూ వారిపైనే విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్‌వాదులు తట్టుకోలేకపోతున్నారు. ఏదేమైనా మల్లన్న బిసి గర్జన తెలంగాణలో చర్చకు తెరలేపిందని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News