Saturday, November 23, 2024

ఆహార కల్తీపై ఫిర్యాదులకు కలెక్టరేట్లలో ప్రత్యేక విభాగం

- Advertisement -
- Advertisement -

కొత్త మూడు ఫుడ్ టెస్టింగ్..
ఐదు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లు
ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంపు
పెరిగిన జనాభాకు అనుగుణంగా
ఆహార భద్రత విభాగం బలోపేతం
ఆహార భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ
బాధ్యతగా వ్యవహరించాలలి
నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేసుకునేవారికి
ప్రభుత్వం అండగా ఉంటుంది
తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోము
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ
స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ లైసెన్సు,
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందజేసిన మంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆహార కల్తీపై సామాన్య ప్రజలు సులువుగా ఫిర్యాదులు చేసేలా అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే కలెక్టరేట్లలో ఉండే ప్రత్యేక విభాగం అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. గత పదేళ్లలో పెరిగిన హోటళ్ల సంఖ్య, జనాభాకు అనుగుణంగా ఆహార భద్రత విభాగం బలోపేతం కాలేదని, ఇప్పుడు ఆ విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

హోటళ్లు, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచబోతున్నామని మంత్రి ప్రకటించారు. దాదాపు 70 ఏళ్ల క్రితం నాచారంలోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారని, ఆ ల్యాబ్‌ను ఆధునీకరించడంతోపాటు వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో కొత్తగా మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.అలాగే కొత్తగా 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నట్లు చెప్పారు. సంవత్సరానికి కనీసం 24 వేల ఫుడ్ సాంపిల్స్ టెస్ట్ చేసేలా ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో మంగళవారం ఆహార భద్రత విభాగం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.

అలాగే పలువురు రెస్టారెంట్, హోటల్ నిర్వాహకులకు ఈట్ రైట్, హైజీన్ రేటింగ్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశంలో ఎలాంటి రాజీ ఉండొద్దని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ సరైన పద్ధతిలో వ్యాపారం చేసుకునే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. ఫుడ్‌తో పాటు, ఫుడ్ తయారు చేసే ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్ట్రీట్ వెండర్స్‌కు సూచించారు. ఫుడ్ బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వహిస్తున్న అవగాహన, ట్రైనింగ్ సదస్సులలో పాల్గొనాలని అన్నారు. ఫుడ్ సేఫ్టీ విభాగం నుంచి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ లైసెన్స్ తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవు

ఆహారం విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చట్టప్రకారం చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేసుకునేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లు అన్నీ పిల్లలకు నాణ్యమైన బోజనం పెట్టాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని చెప్పారు. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉందని, ఆ పేరును నిలబెట్టేలా రాష్ట్రంలో ఫుడ్ ఇండస్ట్రీ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మాత్రమే కాదు అని, హాస్టళ్లు, హాస్పిటల్స్, వర్క్‌ప్లేస్‌లో ఉండే క్యాంటీన్లు కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో పిల్లలకు మంచి భోజనం పెట్టనివారిని కూడా తప్పకుండా శిక్షిస్తాం అని మంత్రి తెలిపారు. ప్రతి హోటల్‌ను, రెస్టారెంట్‌ను, స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్‌ను, డైట్ క్యాంటీన్లను అధికారులు తనిఖీలు చేస్తారని తెలిపారు. మనం హైదరాబాదీలం, భోజన ప్రియులమని, మంచి భోజనం దొరుకుతుందంటే, నాలుగైదు కిలోమీటర్ల దూరమైనా వెళ్లి తింటామన్నారు. కానీ, కొంత గిరాకీ పెరగగానే, ఆ హోటల్లో ఫుడ్ నాణ్యత తగ్గుతోందని, అలా ఉండకూడదని పేర్కొన్నారు. హోటల్ నిర్వాహకులు తమ బ్రాండును కాపాడుకోవాలని సూచించారు. క్వాలిటీ, హైజీన్ మెయింటేయిన్ చేయాలని హితవు పలికారు.

ఉచితంగా ట్రైనింగ్, హైజీన్ కిట్లు

రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెల రోజుల్లో 3,774 హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లు నమోదు చేశామని తెలిపారు. జిహెచ్‌ఎంసి, జిల్లాల్లో సదస్సులు నిర్వహించి, ఫుడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే ఒకటి రెండు నెలల్లో 3000 మందికి అవగాహన కల్పించేందుకు 60 సెషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్న స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు హైజీన్ కిట్స్, ఆప్రాన్లు, హెడ్ క్యాప్స్, గ్లౌజ్‌లు ఉచితంగా అందజేస్తున్నామని కర్ణన్ వెల్లడించారు.

భద్రకాళి టెంపుల్‌కు భోగ్ సర్టిఫికేషన్

వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానానికి, హైదరాబాద్‌లోని శ్రీజయలక్ష్మి మాతా యోగా సెంటర్ ట్రస్ట్‌కు భోగ్ సర్టిఫికెట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా బోగ్ సర్టిఫికెట్ అందజేశారు. ఆహార భద్రత నిబంధనలు పాటిస్తూ పరిశుభ్రంగా ప్రసాదాలు, ఇతర ఆహార పదార్థాలు తయారు చేసే దేవస్థానాలు, మందిరాలకు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి (బ్లిస్‌ఫుల్ అండ్ హైజీనిక్ ఆఫరింగ్ టు గాడ్(భోగ్) సర్టిఫికెట్ ఇస్తారు. భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆలయాల ప్రసాద తయారీ కేంద్రాలను పలుమార్లు పరిశీలించిన అనంతరం, అన్ని రకాల నిబంధనలు పాటిస్తున్నట్టు నిర్దారించుకుని ఈ సర్టిఫికెట్లను ఇస్తారు. మన రాష్ట్రంలో యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహ స్వామి దేవస్థానం, సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్, బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ సహా సుమారు పది ఆలయాలు, ధ్యాన మందిరాలకు భోగ్ సర్టిఫికేషన్ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News