Wednesday, November 6, 2024

జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా పునరుద్ధరణకు తీర్మానం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: పూర్వపు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం ఎన్నికైన ప్రతినిధులతో చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరుతూ జమ్మూ కాశ్మీర్ శాసనసభ బుధవారం ఒక తీర్మానం ఆమోదించింది. దీనిపై బిజెపి సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు. వారు తీర్మానం ప్రతులను చించివేసి, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో గందరగోళ దృశ్యాలు, బిజెపి సభ్యుల ముక్తకంఠ నిరసనలు సభా కార్యకలాపాలకు తరచు అంతరాయం కలిగించాయి. దీనితో తుదకు స్పీకర్ సభను మరునాటికి వాయిదా వేశారు.

ప్రత్యేక హోదాను ‘ఏకపక్షంగా తొలగించడం’పట్ల ‘ఆందోళన’ కూడా వ్యక్తం చేసిన తీర్మానాన్ని ఎటువంటి చర్చా లేకుండానే ఆమోదించడమైంది. గందరగోళ దృశ్యాల మధ్య స్పీకర్ మూజువాణి వోటు నిర్వహించారు. తీర్మానానికి ఆమోద ముద్రతో తమ మేనిఫెస్టో వాగ్దానాల్లో ఒకదానిని అమలు పరిచామని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) వెల్లడించింది. ‘అసెంబ్లీ తన పని చేసింది’ అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. పిడిపి, పీపుల్స్ కాన్ఫరెన్స్, సిపిఐ (ఎం) సభ్యులు మూజువాణి వోటు సమయంలో తీర్మానాన్ని సమర్థించారు. అనేక రాజకీయ పార్టీలు తీర్మానం ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేయగా, ఇది ‘అర్ధమనస్కమైన’ యత్నమని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.

తీర్మానాన్ని ‘ఇంకా మెరుగైన రీతిలో’ రూపొందించి ఉండవలసిందని ఆమె అన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 అధికరణాన్ని మోడీ ప్రభుత్వం 2019లో రద్దు చేసి, పూర్వపు రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జెకె ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘జమ్మూ కాశ్మీర్ అస్తిత్వాన్ని, సంస్కృతిని. ప్రజల హక్కులను పరిరక్షించిన ప్రత్యేక ప్రతిపత్తి, రాజ్యాంగ గ్యారంటీలను ఈ శాసనసభ పునరుద్ఘాటిస్తోంది, వాటిని ఏకపక్షంగా తొలగించడం పట్ల సభ ఆందోళన వ్యక్తం చేస్తోంది’ అని తీర్మానం తెలియజేసింది. పునరుద్ధరణకు సంబంధించిన ఏ ప్రక్రియ అయినా జాతీయ సమైక్యతను, జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కులను పరిరక్షించాలని అసెంబ్లీ ఉద్ఘాటిస్తోందని తీర్మానం తెలిపింది. ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మతో సహా బిజెపి సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించారు.

సభా కార్యక్రమాల జాబితాలో ఇది భాగం కాదని వారు వాదించారు. ‘మేము తీర్మానాన్ని తిరస్కరిస్తున్నాం. మాకు ఇచ్చిన కార్యక్రమాల జాబితాలో ఎల్‌జి ప్రసంగంపై చర్చ ఉన్నది’ అని సునీల్ శర్మ చెప్పారు. ఇక్కడ పార్టీలు పోటాపోటీ పడుతున్నాయని, అసలు ఇదేమీ జరగదని వారికి తెలుసు అని ఎల్‌ఒపి అన్నారు. ఆ చట్టాన్ని దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ఆలయం (పార్లమెంట్) ఆమోదించింది’ అని సునీల్ శర్మ తెలిపారు. శర్మ వ్యాఖ్యలు అధికార పక్షానికి ఆగ్రహం కలిగించాయి. సభలో గందరగోళ దృశ్యాలు కానవచ్చాయి. ఎన్‌సి, బిజెపి సభ్యుల్లో చాలా మంది గట్టిగా కేకలు వేయడం కనిపించింది. బిజెపి సభ్యులు తీర్మానం ప్రతులు చించివేసి, సభ ప్రాంగణంలో విసిరివేశారు. గందరగోళ దృశ్యాల మధ్య స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ ‘ప్రతిపక్ష సభ్యులు మాట్లాడాలని కోరుకోకుంటే నేను దీనిని వోటింగ్‌కు పెడతా’ అని చెప్పారు.

ఆయన తీర్మానాన్ని మూజువాణి వోటుకు పెట్టగా, తీర్మానం రభస మధ్య ఆమోదముద్ర పొందింది. తీర్మానం ఆమోదం పొందగానే బిజెపి సభ్యులు సభ మధ్యంలోకి దూసుకుపోయారు. అప్పుడు సభను 15 నిమిషాల సేపు స్పీకర్ వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తరువాత కూడా బిజెపి సభ్యులు ‘5 ఆగస్టు జిందాబాద్’, ‘జై శ్రీ రామ్’, ‘వందే మాతరం’, ‘యాంటీ నేషనల్ అజెండా నహీ చలేగా’ (జాతి వ్యతిరేక అజెండా చెల్లదు), ‘యాంటీ జమ్మూ అజెండా నహీ చలేగా’ (జమ్మూ వ్యతిరేక అజెండా చెల్లదు) వంటి నినాదాలు చేస్తూనే ఉన్నారు. సభలో గందరగోళ దృశ్యాలు కొనసాగుతుండడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News