అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆరో ర్యాంక్‌కు ఎగబాకాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్ధ సెంచరీలతో రాణించిన పంత్ ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని ఆరో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. పంత్ 750 రేటింగ్ పాయింట్లతో టాప్5లోచోటు కాపాడుకున్నాడు. ఇక భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక ర్యాంక్‌ను కోల్పోయాడు. యశస్వి 777 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. ఇంగ్లండ్ యువ సంచలనం హారీ బ్రూక్ ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని మూడో స్థానంలో నిలిచాడు. యశస్వి కంటే బ్రూక్ కేవలం ఒక పాయింట్ మాత్రమే అధికంగా కలిగివున్నాడు. న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.
విలియమ్సన్ 804 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 903 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రూట్ చాలా రోజులుగా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్‌లో కూడా అతను అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిఛెల్ ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన మిఛెల్ ఏకంగా 8 స్థానాలను మెరుగు పరుచుకున్నాడు. భారత ఆటగాడు శుభ్‌మన్ గిల్ 4 ర్యాంక్‌లను మెరుగు పరుచుకుని 16 స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో గిల్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచిన సంగతి తెలిసిందే. ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా) 8వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. సౌద్ షకిల్ (పాకిస్థాన్) తొమ్మిదో, మార్నస్ లబూషేన్ (ఆస్ట్రేలియా) పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.
కోహ్లి, రోహిత్‌లకు షాక్..
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు తాజా ర్యాంకింగ్స్‌లో షాక్ తగిలింది. వీరిద్దరూ టాప్20 నుంచి వైదొలిగారు. న్యూజిలాండ్ సిరీస్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచిన రోహిత్, కోహ్లి చాలా కాలం తర్వాత బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్20 నుంచి బయటకు వెళ్లిపోయారు. విరాట్ కోహ్లి ఏకంగా 8 ర్యాంక్‌లను కోల్పోయి 22వ స్థానానికి పడిపోయాడు. కివీస్ సిరీస్‌లో కోహ్లి తన కెరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్స్‌పై పడింది. మూడు టెస్టులు ఆడిన కోహ్లి 93 పరుగులే చేశాడు. 2014 డిసెంబర్ తర్వాత కోహ్లి టాప్20 నుంచి వైదొలగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ర్యాంక్‌లు కోల్పోయి 26వ స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడా టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. రబడా 872 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ 847 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. టీమిండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా 838 పాయింట్లతో మూడో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఇక కివీస్‌తో జరిగిన సిరీస్‌లో మెరుగైన బౌలింగ్‌తో అలరించిన రవీంద్ర జడేజా రెండు ర్యాంక్‌లను మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఐదో స్థానంలో నిలిచాడు.