Sunday, December 22, 2024

పదోన్నతులు కావాలి.. పనులు మాత్రం చేయరు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరమ్మతులు చేయకుండా నిర్లక్యం ఎందుకు వహిస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరంగల్ జిల్లాలోని మామునూర్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఆర్ అండ్ బి రోడ్లకు సంబంధించి సచివాలయంలోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రతి సమీక్షలో అధికారులు రోడ్లు బాగున్నాయని చెబుతారు, ప్రజలు రోడ్లు బాగాలేవంటున్నారని, ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి రోడ్లకు సంబంధించిన నివేదిక సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.

రోడ్లకు ప్యాచ్‌వర్క్ చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టీమేషన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తారా అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపార్ట్‌మెంట్‌లో సర్వీస్ రూల్స్ కావాలంటే తీసుకొచ్చామని, ట్రాన్స్‌ఫర్లు చేసుకుంటామంటే అనుమతించానని, అధికారులు ఏదీ అడిగితే అది చేస్తున్నా, వారి పనితీరు మెరుగుపడడం లేదని మం త్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. అధికారుల పనితీరుపై ఇకపై ప్రతివారం సమీక్ష చేయాలని రోడ్లు, భవనాల శాఖ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.

సీఈ మోహన్ నాయక్‌పై మంత్రి సీరియన్
మన పక్కరాష్ట్రాల్లో రోడ్ల మరమ్మతులకు జెట్ ప్యాచ్‌వర్క్ మెషీన్లు, వెలాసిటీ ప్యాచింగ్ వంటి అధునాతన పద్ధతులతో పాట్ హోల్స్ పడిన వెంటనే పూడుస్తుంటే తెలంగాణలో మాత్రం పురాతన పద్ధతుల్లో పాట్‌హోల్స్ మరమ్మతులు చేస్తున్నామని ఇది మన ఆర్ అండ్ బి అధికారులకు ఉన్న నైపుణ్యమని మంత్రి సున్నితంగా చురకలు అంటించారు. రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 4-5 వేల కోట్ల విలువ చేసే రోడ్లకు మరమ్మతులు చేయవచ్చని,ఎక్కడా పనులు జరగడం లేదని సీఈ మోహన్‌నాయక్‌ను మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.

టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంలో జాప్యం సహించను
టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంలో జాప్యం సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. టిమ్స్ ఆస్పత్రి నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందని, ప్రతి సమీక్షలో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు, ప్రారంభించే టైం పెంచడం తప్పా, ఇప్పటిదాక ఏం పురోగతి కనిపించడం లేదని బిల్డింగ్స్ సెక్షన్ సీఈ రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
మన ఇంజనీర్ల పనితీరు ఇదీ
సచివాలయంలోని తన చాంబర్‌లో తన కుర్చీ కింద టైల్స్‌ను బిగించడంలో అధికారులు చూపిన నిర్లక్ష్యాన్ని మంత్రి స్వయంగా చూపించారు. రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి వెయ్యికోట్లకు పైగా ఖర్చుపెట్టామని చెప్పిన మన ఇంజనీర్ల పనితీరు ఇంత నిర్లక్ష్యంగా ఉందని, టైల్స్ మధ్య గ్యాప్స్ ఇలా ఉంటుందా అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.

మూడేళ్లలో ‘మామునూర్’ నిర్మాణం పూర్తి కావాలి
మూడేళ్లలో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. తాత్కాలిక ఏర్పాట్ల కంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. త్వరితగతిన భూసేకరణ పూర్తిచేసి మూడేళ్లలో ఎయిర్‌పోర్టును పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News