ముంబై: సౌదీ అరేబియా వేదికగా ఈ నెల చివర్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం పాట బరిలో భారత్‌తో పాటు విదేశీ స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సౌదీలోని జెడ్డా నగరంలో నవంబర్ 24, 25 తేదీల్లో ఐపిఎల్ మెగా వేలం పాట జరుగనుంది. దీని కోసం ఇప్పటికే 1574 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 1165 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. మరో 409 మంది విదేశీ క్రికెటర్లు బరిలో నిలిచారు. కిందటి సీజన్‌లో ఆయా జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించిన కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లను ఆయా ఫ్రాంచైజీలు వదిలిపెట్టాయి. దీంతో ఈ ముగ్గురు రెండు కోట్ల రూపాయల కనీస ధరతో వేలం పాటలో పాల్గొననున్నారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కిందటి సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపిఎల్ ట్రోఫీని సాధించిన సంగతి తెలిసిందే.
అయితే కోల్‌కతా ఫ్రాంచైజీ యాజమాన్యం శ్రేయస్‌కు షాక్ ఇచ్చింది. అతన్ని అట్టిపెట్టుకోలేదు. దీంతో అతను వేలం పాట బరిలో నిలిచాడు. పంత్, రాహుల్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక జెడ్డాలో జరిగే ఐపిఎల్ వేలంలో వీరు భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, షమి, ఇషాన్ కిషన్, దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్, దేవ్‌దుత్ పడిక్కల్, పృథ్వీషా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ తదితరులు వేలం పాటకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. వీరితో పాటు మ్యాక్స్‌వెల్, వార్నర్, మిఛెల్ స్టార్క్, అండర్సన్, యంగ్, హెన్రీ, విలియమ్సన్, రచిన్ రవీంద్ర తదితర విదేశీ ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.