Friday, November 8, 2024

చేలో పంట… మార్కెట్లో ధర లేక మంట!

- Advertisement -
- Advertisement -

అరుగు మీద కూసున్న రామయ్యను అటుగా పోతున్న సోమయ్య సూసి.. అగో రామయ్య ఏంది దిగాలుగా కూర్చున్నడేంది.. అరె ఏందే రామయ్య.. అంత దిగాలుగా కూసుని ఆలోచిస్తున్నవ్.. మీ ఆవిడ ఏమన్నా అందా ఏంటి.. అవునే.. మా ఆవిడ.. దూం తిడుతోంది.. దేనికే పుట్టింటికి పోతానంటే వద్దన్నావా ఏంది.. యే.. నేనెందుకు అద్దంటనే.. గిప్పుడు కూలీలు దొరకట్లేదు.. పత్తిఏరుదామంటే.. పత్తేమో చేన్లోనే కిందవడిపోతోంది. ఏ చేన్ల చూసినా కైకిలోల్లు దొరక్క పత్తి వలిగి పనంతా ఆగమాగమవుతోందే… ఒకవైపేమో ఆకాశంలో దొంగమబ్బులు తిరుగుతున్నయ్.

వాతావరణ శాఖోల్లేమో అక్కడక్కడ ఆనలు వడ్తాయని చెబుతున్నరు. పుట్టు పత్తి ఏరుడు కాలేదు. కైకిలోల్లు దొరుకుతలేరు. పక్క ఊళ్లోకి వెళ్తే అక్కడా కైకిలోల్ల కొరతనే ఉంది. దొరికినోల్లను అడిగితే కిలో పది రూపాయలని ఒకల్లంటే.. కిలో 12 ఇస్తే అస్తమని మరికొందరంటున్నరే. పండిందే అంతంత అంటే.. అది ఏరుకుని అమ్ముకుందామంటే కైకిలోల్లు దొరకట్లే. ఇగ ఆల్లు అడిగినంత ఇచ్చి ఏరిపిద్దామన్నా మార్కెట్లో ధర లేకపాయే. మార్కెట్లో మద్దతు ధర ఇస్తామని చెబుతున్న గవర్నమెంటేమో కుంటాలుకు రూ. 7521 చెప్పింది. కానీ సిసిఐ సార్లేమో తేమ 8 శాతం ఉంటేనే కొంటామంటున్నరు. ఇగ మొన్నటిదాకా ఆనలు కురిసినయి. ఇప్పుడేమో పొగమంచు కురుస్తోంది. పత్తి ఏరిపిస్తే తేమ ఉండదానే. మరోదిక్కు ఆనలు పడే అవకాశం కనిపిస్తుంది. మరి పత్తి ఏరిపిచ్చి అమ్ముకుందామంటే సిసిఐ సార్లేమే ధర వెడ్తలేరట. మొన్న సూరయ్య పత్తి ఏరిపిచ్చి మార్కెట్కు తీసుకెళ్తే సిసిఐ సార్లు తేమ 13 ఉందని రిజక్ట్ చేసిండ్రట.

ఆయనదే కాదే.. మస్తు మంది రైతులది రిజక్ట్ చేసిండ్రట. దీంతో ఆయన 13% తేమ ఉందని ప్రయివేటుకు అమ్మితే కుంటాలుకు రూ. 6700 ధర వెట్టిండ్రటనే. దీంతో ఆయన లబోదిబోమంటూ పత్తి అమ్ముకుని అచ్చిండు. మంచిదే కదానే.. రామయ్య.. పత్తి అమ్ముకున్నడు కదా.. నువ్వే ఏదైనా ఉపాయం చెప్పవే సోమయ్య. అదేందే గట్లంటున్నవ్. డోలు వోయి మద్దెలకు మొరపెట్టుకున్నట్లు ఇప్పటిదాక నువ్వు కైకిలోల్ల కోసం కూసుండి ఆలోచిస్తుంటే.. నేనేమో బయటకెల్లి ఎవరైనా దొరుకుతరేమోనని అడిగి అడిగి ఓల్లు దొరకక ఇంటికి తిరిగొస్తున్న. మరి ఆడ మార్కెట్లో ధర లేదు. ఈడ అడిగి నంత ఇచ్చుకోలేం. ఏం చేయాలో తెల్వడం లేదు. సూద్దాం.. అప్పులు తీరడం లేదని.. పంట చేన్లో ఉంచుకోలేం. ధర తక్కువుందని తెచ్చి ఇంట్లో ఉంచుకోనూ లేం. ప్రభుత్వాలు మారినా రైతుల బతుకులు మారయే. మార్కెట్లో ఏ వస్తువు ధర అయినా తయారు చేసేటోడే నిర్ణయించుకుంటున్నరు. కానీ మనం పండించిన పంటకు మనం ధర నిర్ణయించుకోలేనని రోజులు ఇలాగే ఉంటయే మన బతుకులు.. అనుకుంటూ సోమయ్య కంట తడివెట్టుకున్నడు.

అందుకేనే మొన్న ఏదో పేపర్ల రైతులు పూర్తిగా తగ్గిపోతున్నరని ఇన్నా. రానున్న రోజుల్లో మనం యవసాయం చేయకపోతే అప్పుడు తెలుస్తుందే మన అవసరం ఎంతుందో. కానీ మనం ఐక్యంగా లేకపోవడమేనే మన బతుకులు ఆగం కావడానికి. అందుకేనే మనల్లి ఒక్కటి కాకుండా పెద్ద పెద్ద యాపారులు అడ్డువడుతున్నరు. పోనీ గవర్నమెంటు అధికారులు మనకు ధర వెట్టించి మన పత్తిని కొనిపిచ్చేందుకు సిసిఐ అధికారులకు చెబుతరంటే ఆల్లే సీద తీసుకెళ్లి పత్తిని ప్రయివేటు వాళ్లకు అమ్మేల చూస్తున్నరే. అరె తేమ ఎక్కువుంటే ఆల్లే కొంచెం చూసీ చూడనట్లు పంటను కొంటే మనకు ఎంతో కొంత భారం తక్కువవుతుంది కదనే. ఆల్లు కూడా మన దిక్కు సూడకనే కన్నే మనం మద్దతు ధర దొరక్క అప్పులు తీరక అవస్థలు పడుతున్నం. ఎప్పుడు గుర్తిస్తరో మరి అధికారులు, ప్రభుత్వాలు.. అంటూ సోమయ్య రామయ్య వద్ద సెలవు తీసుకుని ఇంటి బాట పట్టాడు. మరి ప్రభుత్వాలు సోమయ్య, రామయ్యలాంటి రైతుల బాధను ఎప్పుడు పట్టించుకుంటయో!

-మామిళ్ల వామన్, సీనియర్ జర్నలిస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News