Saturday, November 23, 2024

యాదాద్రి కాదు.. యాదగిరిగుట్ట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/యాదగిరిగుట్ట రూరల్ (యాదాద్రి) : చారిత్రక ప్రాశస్తం కలిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని భక్తులు పిలుచుకునే విధంగానే యాదాద్రి బదులుగా యాదగిరిగుట్టగానే పిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం సిఎం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం యాదాద్రి ఆలయం అభివృద్ధిపై మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎంపి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎంఎల్‌ఎ బీర్ల అయిలయ్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని యాదాద్రి కాకుండా ఇకపై అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగానే వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులకు సిఎంఆదేశించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో మాదిరిగానే యాదగిరిగుట్ట కొండపైన భక్తులు నిద్ర చేసి మొక్కులు తీర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వామి వారి దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని, బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయడానికి వీలుగా నిధులు మంజూరు చేస్తామని సిఎం తెలిపారు. యాదగిరిగుట్టలో జరిగిన అభివృద్ధి పనులు, పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేసి వారం రోజుల్లో అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

నారసింహుడికి సిఎం ప్రత్యేక పూజలు..
శుక్రవారం ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సిఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, వివిధ శాఖల అధికారులు, దేవస్థానం అధికారులు స్వాగతం పలుకగా కాన్వాయ్ ద్వారా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి దంపతులు అక్కడి నుంచి యాదగిరిగుట్ట కొండపైకి చేరుకున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్న సిఎంకు సాంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆలయంలోకి ఘన స్వాగతం పలికారు. స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న సిఎంకు ఆలయ ప్రధానార్చకులు, అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహ్మమూర్తి, ఇఒ భాస్కర్‌రావు స్వామివారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు.

స్వామివారి దర్శనం అనంతరం రాష్ట్రపతి భవన్‌లో అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధితో పాటు పలు ముఖ్యమైన అంశాలపై అధికారులను ఆదేశించారు. అనంతరం వలిగొండ మండలం సంగెంలో పాదయాత్రకు కాన్వాయ్‌లోనే బయల్దేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు ఎంఎల్‌ఎ బీర్ల అయిలయ్య, ఎంఎల్‌ఎలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, మల్‌రెడ్డి రంగారెడ్డి, మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ బండ్రు శోభారాణి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత్ కె జెండగే, రాచకొండ సిపి సుధీర్‌బాబు, ఎసిపి రమేష్, యాదగిరిగుట్ట మున్సిపల్ ఛైర్మన్ ఎరుకల సుధామహేందర్‌గౌడ్, కౌన్సిలరలతో పాటు స్థా నిక కాంగ్రెస్ నేతలు చీర శ్రీశైలం, కానుగు బాలరాజుగౌడ్, ఈరసరపు యాదగిరి, దుబ్బాల వెంకట్‌రెడ్డి, ఉపేందర్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News