Thursday, December 26, 2024

చదువుతో సమానత్వం

- Advertisement -
- Advertisement -

బాలికల ‘గౌరవప్రద జీవనానికి’ విద్యాహక్కు చట్టం దోహదం చేస్తుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కానీ క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచం ఆధునికంగా ఎంత దూసుకుపోతున్నా నేటికీ విశ్వవాప్తంగా 77 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వారిలో అత్యధికులు మహిళలే. కోవిడ్ మహమ్మారి తర్వాత కోటి మందికి పైగా బాలికలు బడికి వెళ్లలేకపోయారు. బాలికలకు విద్యను అందించడంలో నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారితీస్తోంది. వారిని విద్యావంతులను చేయకపోవడం, పాఠశాల స్థాయిలోనే వారి చదువుకు స్వస్తి పలకడం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ ఆందోళనకరమైన అంశాన్ని ప్రపంచబ్యాంకు ఎన్నోమార్లు బహిర్గతంచేసింది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 89% మంది బాలికలు వారి ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుంటుండగా, 77% మంది బాలికలు మాత్రమే ఉన్నతస్థాయి విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపింది. ఉన్నతస్థాయి విద్యనభ్యసించిన మహిళలు వారికంటే తక్కువ చదువుకున్న వారితో పోల్చితే ఎక్కువ పని చేస్తున్నారని, దాదాపు రెండింతలు ఆర్జిస్తున్నారని తేలింది. విద్యనభ్యసించకపోవడం వల్ల కోట్లాది మంది బాలికలు ఇంజనీర్లు, జర్నలిస్టులు, సిఇఒలు కాలేకపోతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్లలో నష్టం వాటిల్లుతోంది. బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి. కానీ, ప్రభుత్వాలు బాలికలు చదుకునేందుకు అనువైన సౌకర్యాలు, వాతావరణం క్షేత్రస్థాయిలో అందడం లేదు. మరుగుదొడ్లు, వాటిలో నీటి సౌకర్యం లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థినులు అర్ధాంతరంగా బడికి దూరమవుతున్నారు. ప్రపంచంలోని నిరక్షరాస్యుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలే.

లింగ వివక్షకు ప్రధాన కారణాల్లో మహిళలకు తగిన స్థాయిలో విద్యావకాశాలు అందకపోవడం కూడా ఒకటి.దీన్ని రూపుమాపి లింగ సమానత్వం సాధించాలంటే అటు తల్లిదండ్రులు, ఇటు ప్రభుత్వాలు బాలికల విద్యను ప్రోత్సహించాలి. కానీ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 12.2 కోట్ల మంది బాలికలు బడికి దూరంగా ఉన్నారు. ఒక్క దక్షిణాసియాలోనే పాఠశాలకు వెళ్లని బాలికల సంఖ్య 4.1 కోట్లు కావడం గమనార్హం. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కానీ ఇప్పటికీ ఆచారాలు, సంప్రదాయాలు వారి తలరాతను నిర్దేశిస్తుండటమే బాధాకరం.మన దేశంలో ఏటా సుమారు కోటి ఇరవై లక్షల మంది బాలికలు జన్మిస్తున్నారు. వీరిలో 15 ఏళ్ల వయస్సు వచ్చేసరికి సుమారు 30 లక్షల మంది మరణిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం బాలికలపట్ల చూపుతున్న నిర్లక్ష్యం. నాలుగంటే నాలుగు ముక్కలు నేర్చుకోవడానికి పడుతున్న సవాలక్ష తంటాల్ని ఏమీ పట్టించుకోకుండా సంకుచిత మత భేషజాల చుట్టూ, రాజకీయాల చుట్టూ పిల్లల చదువుల్ని తిప్పితిప్పి వాళ్ళ బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నాయి.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. మగ పిల్లలతో వారిని పాఠశాలల్లో చేర్పించినా, కుటుంబ ఆర్థిక అవసరాల కోసమో, ఇతర బాధ్యతలు నెరవేర్చడం కోసమో ఆడ పిల్లలను చదువుకు దూరం చేస్తున్నారు. ఉన్నత విద్యావకాశాలు అందుకుంటున్న బాలికలు నూటికి 10 నుంచి 30 శాతం మాత్రమే ఉంటున్నారు. ప్రతి అయిదుగురు బాలికల్లో ఒకరు కనీసం పదవ తరగతి వరకైనా చదవడం లేదని ఐరాస మహిళా విభాగం, యునిసెఫ్‌ల నివేదిక స్పష్టం చేసింది. పై చదువులకు వెళ్ళి ప్రతి పది మంది బాలికల్లో నలుగురు ఇంటర్మీడియట్ పూర్తి చేయలేకపోతున్నారు. అల్పాదాయ దేశాల్లోని యువతుల్లో 90% అంతర్జాత సేవలను వినియోగించలేకపోతున్నారు. 514 ఏళ్ల వయసు బాలికలు తమ సమాన వయసున్న అబ్బాయిల కంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. కుటుంబాల్లో పనిభారం పడటం, కౌమార బాలికలు సన్నిహితుల నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఆడపిల్లకు చదువులో ఎదురయ్యే అవాంతరాలు, కష్టాలు మగపిల్లల కంటే ఎన్నోరెట్లు ఎక్కువ.

స్త్రీపురుష సమతుల్యతను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకాన్ని 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. లైంగిక వివక్షను నిరోధించడం, అడపిల్లలు స్వేచ్ఛగా, సురక్షితంగా జీవించేలా చేయడంతోపాటు విద్యను అందించడం ప్రధాన లక్ష్యం. విద్యాహక్కు చట్టం, సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకాలను అమలుచేస్తూ స్కాలర్‌షిప్‌లను అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా బాలికా విద్యకు దోహదపడుతున్నాయి. తెలంగాణలో పాఠశాలల్లో చదివే బాలికల భద్రతకు ‘గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్ క్లబ్ (జిసిఇసి)’ కృషి చేస్తోంది. షీ టీం, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్లబ్బులు లైంగిక వేధింపులు, వారి భద్రతకు అమల్లో ఉన్న చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. బాలికలకు లైంగిక విద్యను అందించడంతోపాటు సమాజంలో ఎదురయ్యే వివిధ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించేందుకు జిసి క్లబ్ సభ్యులు కృషి చేస్తున్నారు.

లైంగిక, ఈవ్ టీజింగ్ తదితర సమస్యలను వెంటనే గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు స్థానిక పోలీసులు, బాలికలకు మధ్య వారధిగా ఈ క్లబ్బులు పని చేస్తున్నాయి. 2019లో రాష్ర్ట ప్రభుత్వం ‘బాలమిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వందలాది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలకు అండగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిస్తే పోలీసులకు తెలియజేయాలి. నిందితుడికి 6 నెలల జైలుశిక్ష లేదంటే జరిమాన కట్టాల్సి ఉంటుంది. లింగ సమానత్వం కోసం భ్రూణహత్యలు, పౌష్టికాహార లోపాలు, అనారోగ్యం, అవిద్య, బాల్యవివాహాలు, బాలికల అక్రమ రవాణా వంటి సమస్యలు విద్యకు ఆటంకంగా పరిణమిస్తున్నాయి.

కోడం పవన్‌కుమార్
98489 92825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News