Monday, December 23, 2024

ఇందిరా గాంధీని ప్రధాని కాకుండా పితృస్వామ్యం ఆపలేదు:నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

భారత్‌లో మహిళలు తాము కోరుకున్నది సాధించకుండా పితృస్వామ్యం నిలువరించి ఉంటే ఇందిరా గాంధీ ఎలా ప్రధాని అయ్యారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ శనివారం బెంగళూరులో సిఎంఎస్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో సమావేశమై, ఆవిష్కరణలకు మద్దతు కోసం కేంద్రం చేపట్టిన వివిధ చర్యలు, యువజనుల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాల గురించి చర్చించారు. 21 నుంచి 24 సంవత్సరాల వయోవర్గంలోని ‘నిరుద్యోగ యువత’ కోసం ఒక కోటి ఇంటర్న్‌షిప్‌లు కూడా ఆ పథకాల్లో ఉన్నాయి. మహిళా సాధికారత గురించిన ఒక ప్రశ్నకు సీతారామన్ సమాధానం ఇస్తూ, పితృస్వామ్యం అనేది వామపక్షాలు సృష్టించిన సిద్ధాంతం అని అన్నారు. ‘అద్భుత పదజాలాలకు లోను కాకండి. మీరు మీ కోసం నిలబడి, హేతుబద్ధంగా మాట్లాడినట్లయితే మీ కలల సాఫల్యం నుంచి మిమ్మల్ని పితృస్వామ్యం అడ్డుకోదు’ అని సభికులలోని మహిళలను ఉద్దేశించి మంత్రి సలహా ఇచ్చారు.

అయితే, మహిళలకు తగినంతగా సదుపాయాలు లేవని, మరిన్ని సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉందని ఆమె అంగీకరించారు. భారత్‌లో ఆవిష్కర్తలకు అవకాశాలపై ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి సమాధానం ఇస్తూ, ఆవిష్కర్తలకు సానుకూల వాతావరణాన్ని మోడీ ప్రభుత్వం సృష్టిస్తున్నదని చెప్పారు. ‘కేవలం విధానాలు ప్రవేశపెట్టడం ద్వారా ఆవిష్కరణకు మేము మద్దతు ఇవ్వడం లేదు’ అని ఆమె తెలిపారు. అటువంటి ఆవిష్కరణలకు మార్కెట్లు కూడా లభ్యమయ్యేలా చూసేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. ఎంఎస్‌ఎంఇలకు అందుబాటులో ఉన్న తోడ్పాటు యంత్రాంగాన్ని ఆమె ఇందుకు ఒక ఉదాహరణగా ఉటంకించారు. ప్రభుత్వ కొనుగోళ్లలో వాటికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీతారామన్ తెలియజేశారు. అన్ని ప్రభుత్వ కొనుగోళ్లలో 40 శాతం వరకు ఎంఎస్‌ఎంఇల నుంచి వస్తున్నాయని ఆమె తెలిపారు.

‘అందుకే భారత్‌లో రెండు లక్షలకు పైగా స్టార్టప్‌లు మనకు ఉన్నాయి. వాటిలో 130 పైగా యూనికార్న్‌లుగా మారాయి. అవకాశాలు పుష్కలం, కానీ వాటిని పూర్తిగా వినియోగించుకోవడం లేదు’ అని సీతారామన్ చెప్పారు. భారత్‌లో చోటు చేసుకుంటున్న డిజిటల్ బ్యాంకింగ్ పరివర్తన విషయంలో కూడా అదే పరిస్థితి అని ఆమె పేర్కొన్నారు. జన్ ధన్ యోజన ద్వారా సామాన్యులకు అవకాశాల సృష్టి జరుగుతోందని సీతారామన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News