Friday, November 22, 2024

నేడు సౌతాఫ్రికా-భారత్ రెండో టీ20..

- Advertisement -
- Advertisement -

గ్కేబెర్హా: సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి టి20లో గెలిచి జోరుమీదున్న భారత్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో ఉంది. ఆతిథ్య సౌతాఫ్రికా కూడా గెలుపే లక్షంతో బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకువాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
సంజు జోరు సాగాలి..
తొలి టి20లో విధ్వంసక శతకంతో చెలరేగి పోయిన ఓపెనర్ సంజు శాంసన్‌పై ఈసారి కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వరుసగా రెండు టి20 మ్యాచుల్లో సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించిన సంజు హ్యాట్రిక్ శతకాలపై కన్నేశాడు. ముచ్చటగా మూడో టి20 శతకంతో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోవాలని తహతహలాడుతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా సంజు సొంతం. అతను తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ఆపడం ప్రత్యర్థి టీమ్ బౌలర్లకు చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పాలి. శాంసన్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. సంజు విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగితే ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అభిషేక్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఐపిఎల్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించిన అభిషేక్ టీమిండియాలో అనూహ్యంగా చోటు దక్కింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. రెండో టి20లో మెరుగ్గా ఆడకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. తొలి టి20లో సూర్యకుమార్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈసారి మాత్రం మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలని భావిస్తున్నాడు. టి20 స్పెషలిస్ట్‌గా పేరున్న సూర్యకుమార్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం.
ఇదే మంచి ఛాన్స్..
మరోవైపు టీమిండియాలో స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తున్న యువ ఆటగాళ్లకు ఇదే మంచి ఛాన్స్‌గా చెప్పాలి. రింకు సింగ్, తిలక్‌వర్మ, అభిషేక్ శర్మ తదితరులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సిరీస్‌లో రాణిస్తే రానున్న రోజుల్లో జాతీయ జట్టులో చోటు కాపాడుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో యువ ఆటగాళ్లు ఛాన్స్ వృథా చేసుకోకూడదని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇదిలావుంటే తొలి టి20లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అవేశా ఖాన్, అర్ష్‌దీప్ తదితరులు మెరుగైన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
పరీక్షలాంటిదే..
ఇక, ఆతిథ్య సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ పరీక్షలాంటిదేనని చెప్పాలి. యువ ఆటగాళ్లతో కూడిన భారత్‌ను ఓడించాలంటే సఫారీ టీమ్ ఒడ్డి పోరాడక తప్పదు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ మార్‌క్రమ్‌పై నెలకొంది. ఓపెనర్లు మార్‌క్రమ్, రియాన్ రికెల్టన్‌లు శుభారంభం అందించక తప్పదు. ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, క్రుగర్, మార్కొ జాన్సెన్ తదితరులతో సౌతాఫ్రికా చాలా బలంగా ఉంది. అయితే సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. ఈ మ్యాచ్‌లో మాత్రం పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News