హోటల్‌లోని ఫ్రిజ్ కంప్రెసర్ పేలడంతో ఓ మహిళకు గాయాలైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 1లోని తెలంగాణ స్సైస్ కిచెన్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే ఉదయం హోటల్‌కు వచ్చారు. హోటల్‌లోని ఫ్రిజ్ కంప్రెసర్ పేలడంతో పహ్రరీ ధ్వంసమైంది, దాని రాళ్లు ఎగిరి 100 మీటర్ల దూరం ఉన్న దుర్గాభవానీ నగర్ బస్తీలోని ఇళ్లపై పడ్డాయి. దీంతో నాలుగు గుడిసెలు ధ్వంసం కాగా మహిళకు గాయాలయ్యాయి. పేలుడుదాటికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ ఎత్తున పేలుడు సంభవించడంతో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెస్ట్‌జోన్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ ఎసిపి వెంకటగిరి హోటల్ నిర్వాహకులతో మాట్లాడి వివరాలు అడిగారు. హోటల్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియదని ఎసిపి తెలిపారు. సంఘటన స్థలాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి, బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలంలో తనిఖీలు చేశారు.
స్థానికుల పరుగు…
ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించగానే పొగలు అలుముకున్నాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియకపోవడంతో స్థానికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. బస్తీలోని ఇళ్లపై రాళ్లు పడడంతో వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. హోటల్‌లోని వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గ్యాస్ లీకేజి వల్లే ప్రమాదం: విజయ్‌కుమార్, డిసిపి
గ్యాస్ లీకేజి వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ తెలిపారు. ఫైర్ , క్లూస్ టీం బృందాలతో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. హైడ్రా బృందం కూడా ఘటనపై దర్యాప్తు చేస్తోందని అన్నారు. ప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. హోటల్‌కు సంబంధించిన ఫైర్ సేఫ్టీ అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.