Monday, December 23, 2024

పరిమిత వీసాలతో ప్రగతికి దెబ్బ

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశీ పౌరులకు వీసాలపై పరిమితి విధించడం పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, త్రిపుర, ఇతర ఈశాన్య రాష్ట్రాలను ఆర్థికంగా ప్రభావితం చేసింది. భారత్, పాకిస్తాన్ ప్రజల మధ్య సంబంధాల వలె కాకుండా భారత్, బంగ్లాదేశ్ ప్రజల మధ్య సంబంధాలు ముఖ్యంగా 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్రానంతరం కొనసాగాయి. దేశ విభజన లక్షలాది కుటుంబాలను సమానంగా విడదీసింది. వారు సరిహద్దుకు రెండు వైపుల నుంచి నిష్క్రమించవలసి వచ్చింది. భారత్ వీసాలపై పరిమితి విధించడం సరిహద్దుకు రెండు వైపుల తమ బంధువులను సందర్శించే అవకాశాన్ని అనేక కుటుంబాలకు లేకుండా చేసింది. అదృష్టవశాత్తు, బంగ్లాదేశ్ భారతీయ పౌరులకు వీసా అవకాశాలు ఇంకా కొనసాగిస్తోంది.

బంగ్లాదేశ్‌లో ఆగ్రహోదగ్రులైన విద్యార్థులు, ఇతర నిరసనకారుల దూకుడుకు షేఖ్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలగా, పదవీచ్యుతురాలైన ప్రధాని భారత్‌కు పారిపోయిన తరువాత భారత్ ముందుగా చేసిన పని ఏమిటంటే ఢాకాలోను, ఆ దేశంలోని ఇతర ప్రాంతాల్లోను గల వీసా ప్రాసెసింగ్ కేంద్రాలన నిరవధికంగా మూసివేయడం. విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం ఇప్పుడు పరిమిత సంఖ్యలో వీసాలు జారీ చేస్తోంది. వైద్య అవసరాలు లేదా ఇతర కారణాలతో భారత్‌కు రావాలని అభిలషిస్తున్నవారికి భారత ప్రభుత్వం పరిమిత సంఖ్యలో వీసాలు జారీ చేస్తుంది. బంగ్లాదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడి, మామూలు పరిస్థితులు తిరిగి నెలకొన్న తరువాత వీసా జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని ఎంఇఎ చెబుతోంది.

బంగ్లాదేశీ పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, బంగ్లాదేశీ పర్యాటకులు లేకపోవడం వల్ల భారత్‌లో వివిధ రంగాల్లో వ్యాపార నష్టాన్ని పట్టించుకోకుండా భారతీయ మీడియాలో అత్యధిక భాగం దాదాపు అన్ని కేటగరీలకు వీసా ప్రాసెసింగ్ మూసివేతను సమర్థిస్తోంది. భారత్‌కు వచ్చే పర్యాటక మార్కెట్‌లో గణనీయంగా 23 శాతం వాటా బంగ్లాదేశీ పర్యాటకులది. వారు ప్రధానంగా వైద్య పర్యాటకం, ముఖ్యంగా దుర్గా పూజ, పెళ్లిళ్ల సీజన్లు వంటి కీలక సమయాల్లో షాపింగ్ కోసం భారత్‌కు వస్తుంటారు.

బంగ్లాదేశ్‌లోని హిందు మైనారిటీలకు రక్షణ సమకూర్చడంలో నోబెల్ గ్రహీత డాక్టర్ ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని విమర్శించడంలో భారతీయ మీడియాలో ఒక వర్గం నిమగ్నమైంది. అయితే, వాస్తవం ఏమిటంటే, తుదకు షేఖ్ హసీనా హయాంలో కూడా రాడికల్ ఇస్లామిస్ట్‌ల పెరుగుదల, హిందు, ఇతర మైనారిటీ వర్గాలపై దాడులు వేర్వేరు స్థాయిలలో ఎప్పుడూ సాగుతూనే ఉండడం. కాకపోతే, హసీనా ప్రభుత్వం పతనంతో ఆ దేశంలో మైనారిటీలపై దాడులు పెచ్చుమీరాయి. అయితే, బహుశా భారత్‌లో బిజెపి హయాంలో మరింత మంది ముస్లింలు, ఇతర మైనారిటీలు రోజువారీగా దాడులను, వివక్షలను ఎదుర్కొంటున్నారు. అటువంటి దైనందిన దాడులు, బెదిరింపులను మీడియాలో సమాచారం ఇవ్వవలసినవిగా కాకుండా మామూలు ఘటనలుగానే భారతీయ మీడియా ప్రధాన స్రవంతి భావిస్తోంది.

బంగ్లాదేశీ జాతీయులకు పరిమితంగా వీసాల జారీని బంగ్లాదేశీ జాతీయులు బంగ్లాదేశ్‌లో వివిధ ప్రదేశాల్లో దుర్గా పూజ ఉత్సవాల్లో ఆగస్టులో విగ్రహాల విధ్వంసం సంఘటనలకు ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. ‘బంగ్లాదేశ్‌లోని మతపరమైన మైనారిటీల పరిరక్షణ గురించి (భారత ప్రధాని నరేంద్ర మోడీకి) తాము ఇచ్చిన హామీలను అమలు చేయవలసిందిగా బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. భద్రంగా ఉన్నామని వారికి భావన కలిగేలా చర్యలు తీసుకోవాలి’ అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు. అయితే, వీసా జారీ అనేది భారత్ సర్వసత్తాక నిర్ణయం అని, దానిని ప్రశ్నించజాలమని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు తౌహిద్ హుస్సేన్ యాదాలాపంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘అయితే, ఇతర దేశాల కోసం వీసాలు పొందేందుకు పలువురు వ్యక్తులు భారత్‌కు ప్రయాణిస్తుంటారని భారత హై కమిషన్‌కు తెలియజేశాం. న్యూఢిల్లీలోని కార్యాలయం నుంచి వీసాలు జారీ చేసే దేశాల్లో చదువుకోవాలని అభిలషించే విద్యార్థులకు ఈ పరిస్థితి నష్టదాయకం కూడా’ అని ఆయన పేర్కొన్నారు. భారత్ వీసా ప్రక్రియను సడలించినట్లయితే, బంగ్లాదేశ్‌కు ఉపయుక్తంగా ఉంటుందని భారత హైకమిషనర్‌కు ఆయన సూచించారు.

జులైలో విద్యార్థుల ఉద్య మం సమయంలో కొద్ది కాలం నిలిపివేసిన కార్యకలాపాలను భారత హై కమిషన్ తిరిగి ప్రారంభించడం గమనార్హం. కానీ అది ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే వీసాలు జారీ చేస్తోంది. ఆసక్తికరమేమంటే తాము వీసాల జారీని నిలిపివేసినట్లు భారత్ ప్రకటించకపోవడం. మానవ వనరుల సమస్యలు, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా అది తాత్కాలిక సమస్య అని భారత్ పేర్కొన్నది. వీసా కేంద్రాల్లో భద్రత లేమి వీసా కార్యాలయాలు మామూలుగా పని చేయడానికి అవరోధం కల్పిస్తున్నది. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం, రాజధాని ఢాకా వెలుపల కొన్ని కేంద్రాల్లో దాడుల పర్యవసానంగా భారత సిబ్బందిలో అత్యంత అవసరం కాని వంద మందికి పైగా భారత్‌కు వెళ్లిపోయారు. భారత హై కమిషనర్ ప్రణయ్ కుమార్ వర్మ తాజా పరిస్థితి గురించి బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారుకు వివరించారు. తాము ప్రస్తుతం ‘పది శాతం స్తోమత’ లోనే పని చేస్తున్నామని, భద్రత గురించిన ఆందోళనలను పరిహరించవలసి ఉందని వర్మ తెలిపారు.

ఢాకాలో దౌత్య కార్యాలయాలు లేని దేశాల కోసం వీసా దరఖాస్తుల పరిశీలనకు భారత్ కృషి చేస్తోందని కూడా వర్మ తెలియజేశారు. భారతీయ నగరాలకు, ముఖ్యంగా కోల్‌కతాకు బంగ్లాదేశ్ నుంచి పర్యాటకుల సంఖ్య తగ్గడం వల్ల హోటల్, రెస్టారెంట్ వ్యాపారం, టూర్ ఆపరేటర్ పరిశ్రమ అవకాశాలకు విఘాతం కలిగింది. స్వల్ప సంఖ్యలోని ప్రయాణికుల కారణంగా ఢాకా, చిట్టగాంగ్ నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు ప్రయాణికుల విమాన సర్వీసులు గణనీయంగా తగ్గిపోయాయి. అదే విధంగా ఖుల్నా, ఢాకా నుంచి కోల్‌కతాకు, సిలిగురికి సరాసరి ప్రయాణికుల రైళ్లు కూడా ప్రయాణికుల కొరత వల్ల నిలిచిపోయాయి. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర సహా పలు భారతీయ రాష్ట్రాలకు భూతల సరిహద్దులు మాత్రమే తెరచి ఉన్నాయి. టాప్ 15 దేశాల్లో బంగ్లాదేశ్ (22.3 శాతం) 2023లో భారత్‌లోకి విదేశీ పర్యాటకు రాక (ఎఫ్‌టిఎలు) విషయంలో అగ్ర స్థానంలో ఉన్నదని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్‌ఎ), యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని భారత టూరిజం మంత్రిత్వశాఖ వెల్లడించింది.

2023లో భారత్‌ను సుమారు 2.12 మిలియన్ల మంది టూరిస్టులు సందర్శించారు. ఆ ఏడాది ఎఫ్‌టిఎల్లో బంగ్లాదేశ్‌ను అగ్ర స్థానంలో నిలిపింది. ప్రధానంగా వైద్య, షాపింగ్ కారణాలపై భారత్‌కు వచ్చే పర్యాటకంలో 23 శాతం వాటా ఉన్న బంగ్లాదేశ్ ప్రయాణికుల సంఖ్య ఇటీవలి సంక్షోభం దృష్టా విదేశీ ప్రయాణంలో 90 శాతం క్షీణతను చూసింది. వైద్య చికిత్స నిమిత్తం మెజారిటీ (80 శాతం పైగా) భారత్‌కు వస్తుంటారు. షాపింగ్ (15 శాతం), లీజర్ (5 శాతం) ఆ తరువాతి కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా పండుగలకు ముందు ఎక్కువ మంది షాపింగ్‌కు ఇష్టపడే ప్రదేశం కోల్‌కతా. ఇక సిక్కిం, ఈశాన్య భారతం, కశ్మీర్ వారికి ఇష్టమైన లీజర్ గమ్యస్థానాలు.

విమాన సర్వీసులకు అంతరాయం, వీసా సేవలను పరిమితం చేయడంతో రెండు దేశాల మధ్య ప్రయాణం దాదాపుగా నిలిచిపోయింది. ముఖ్యంగా కోల్‌కతా, ఈశాన్య భారతం వంటి పాప్యులర్ గమ్యస్థానాలను ప్రభావితం చేస్తున్న ఈ క్షీణత బుకింగ్‌లలో 40 శాతం పతనానికి దారి తీసింది. బయట నుంచి భారత్‌కు ప్రయాణం బంగ్లాదేశ్ ట్రావెల్ మార్కెట్‌లో గణనీయ భాగానికి ప్రాతినిధ్యం వహిస్తోందని బంగ్లాదేశ్ టూర్ ఆపరేటర్ల సంఘం డైరెక్టర్ మహమ్మద్ తస్లీమ్ అమీన్ షోవోన్ తెలిపారు.
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వైద్య పర్యాటకం 2023లో 48 శాతాన్ని చేరింది. 2022లో 3,04,067గా ఉన్న రోగుల సంఖ్య 2023లో 4,49,570కి చేరింది. తమ సంస్థ నెలకు కనీసం 150 మంది బంగ్లాదేశీ రోగులకు ప్రయాణ అవకాశం కల్పిస్తుంటుందని కోల్‌కతా కేంద్రంగా గల మెడికల్ టూరిజం కంపెనీ ఇండియా ట్రీట్స్‌మెంట్. కామ్ సిఇఒ, వ్యవస్థాపకుడు సమిత్ బెజ్ తెలిపారు. ‘ఇప్పుడు ఈ సంఖ్య కేవలం ఐదుగురు లేదా ఆరుగురు రోగులకు తగ్గిపోయింది. అనేక మంది బంగ్లాదేశీ పౌరులు తమ పాస్‌పోర్టులు వాపసు వచ్చిన తరువాత థాయిలాండ్, మలేషియా. సింగపూర్‌లలో వైద్య సేవలను కోరుకుంటున్నారు’ అని బెజ్ తెలియజేశారు.

బంగ్లాదేశీ పౌరులకు వీసాలపై పరిమితి విధించడం పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, త్రిపుర, ఇతర ఈశాన్య రాష్ట్రాలను ఆర్థికంగా ప్రభావితం చేసింది. భారత్, పాకిస్తాన్ ప్రజల మధ్య సంబంధాల వలె కాకుండా భారత్, బంగ్లాదేశ్ ప్రజల మధ్య సంబంధాలు ముఖ్యంగా 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్రానంతరం కొనసాగాయి. దేశ విభజన లక్షలాది కుటుంబాలను సమానంగా విడదీసింది. వారు సరిహద్దుకు రెండు వైపుల నుంచి నిష్క్రమించవలసి వచ్చింది. భారత్ వీసాలపై పరిమితి విధించడం సరిహద్దుకు రెండు వైపుల తమ బంధువులను సందర్శించే అవకాశాన్ని అనేక కుటుంబాలకు లేకుండా చేసింది. అదృష్టవశాత్తు, బంగ్లాదేశ్ భారతీయ పౌరులకు వీసా అవకాశాలు ఇంకా కొనసాగిస్తోంది. అయితే, కల్లోలిత దేశంలో భద్రత, రక్షణలేమి భయంతో బంగ్లాదేశ్‌ను సందర్శించేందుకు కొద్ది మంది మాత్రమే భారత్ నుంచి సిద్ధపడుతున్నారు.

ఈశాన్యోపనిషత్

గీతార్థ పాఠక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News