కొత్త ఖరీఫ్ పంట దిగుబడి మొదలైనందున రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింతగా తగ్గవచ్చని భావిస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలియజేశారు. ప్రస్తుతం సగటు అఖిల భారత రిటైల్ ఉల్లి ధర కిలోకు రూ. 54గా ఉందని, కీలక వినియోగ కేంద్రాల్లో ప్రభుత్వ సబ్సిడీ ధరకు ఉల్లి విక్రయాన్ని ప్రారంభించిన తరువాత గడచిన ఒక మాసంలో ధరలు తగ్గాయని అధికారి తెలిపారు. అధిక ధరల భారం నుంచి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోను,
ఇతర నగరాల్లోను కిలో రూ. 35 సబ్సిడీ ధరకు ప్రభుత్వంరిటైల్ మార్కెట్‌లో ఉల్లి బఫర్ నిల్వలను విక్రయిస్తోంది. ప్రభుత్వం వద్ద నాలుగున్నర లక్షల టన్నుల ఉల్లి బఫర్ నిల్వలు ఉన్నాయి. వాటిలో లక్షన్నర టన్నులను ఇప్పటి వరకు ప్రభుత్వం ఇప్పటి వరకు విక్రయించింది. మొట్టమొదటి సారిగా కీలక వినియోగ కేంద్రాలకు రైల్వేల ద్వారా ఉల్లి బఫర్ నిల్వలు రవాణా చేస్తున్నట్లు, సరఫరాలపెంపుదలకు తోడ్పడుతున్నట్లు మంత్రిత్వశాఖ అధికారి తెలిపారు.