Friday, November 15, 2024

కాప్-29 సదస్సులో వివాదాల వేడి

- Advertisement -
- Advertisement -

పారిశ్రామిక యుగం కన్నా ముందటి స్థాయికి భూతాపాన్ని కనీసం 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తగ్గించాలని పారిస్ వాతావరణ సదస్సులో కుదిరిన ఒప్పందం లక్షాలను సాధించడానికి ఏటా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన వాతావరణ సదస్సులు (కాప్) జరుగుతుండడం పరిపాటిగా వస్తోంది. భవిష్యత్తులో భూగోళాన్ని ఎలా రక్షించుకోవాలన్న ప్రధాన అంశాలు ఈ సదస్సుల్లో చర్చిస్తారు. వాతావరణ మార్పులను నివారించడానికి ఎలాంటి ప్రణాళికలు చేపట్టాల్సి ఉంటుందో సదస్సులోని 193 సభ్యదేశాలు చర్చించవలసి ఉంటుంది.

వాతావరణ మార్పుల కట్టడికి కట్టుబడి ఉండటం ఎంతో వ్యయంతో కూడుకున్న లక్షం అయినందున వర్ధమాన దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందిస్తామని అభివృద్ధి చెందిన దేశాలు 2009 కొపెనెహెగెన్ వాతావరణ సదస్సులో ప్రతిజ్ఞ చేసినా అది ఇంతవరకు సరిగ్గా అమలు కావడం లేదు. ఈసారి వంద బిలియన్ డాలర్లకు బదులు ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఆర్థిక సాయాన్ని పెంచవలసిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ఈ నేపథ్యంలో కాప్ 29 సదస్సు అజెర్‌బైజాన్ దేశరాజధాని బాకూలో సోమవారం ప్రారంభమైంది. ప్రారంభంలోనే 12 రోజుల ఎజెండాపై దేశాల మధ్య వివాదం తలెత్తింది. ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, వాతావరణ సదస్సులంటే గిట్టని డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షునిగా అఖండ విజయం సాధించడం వంటి పరిణామాలు ఈ కాప్ 29 సదస్సుపై ప్రభావం చూపనున్నాయి.

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడు యుర్సులా వాన్‌డెర్ లెయెన్ తదితర ప్రముఖులు ఈ సదస్సుకు దూరంగా ఉంటారన్న అపోహలు వెంటాడుతున్నాయి. ఈ కాప్ 29 సదస్సుకు అజెర్‌బైజాన్ ఆతిథ్యం ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురుబావులు కలిగిన దేశంగా అజెర్‌బైజాన్ చరిత్రకెక్కింది. గత ఏడాది కాప్ 28 సదస్సు నిర్దేశించిన శిలాజ ఇంధనాల తగ్గింపు లక్షం నెరవేర్చడంలో ఈ దేశం విఫలమైంది. 2023లో ఈ దేశం ఆదాయంలో 35% చమురు, సహజవాయువుల నుంచే లభించింది. అంతకు ముందు రెండు సంవత్సరాలు ఆదాయం 50% చమురు నుంచే లభించడం గమనార్హం. అయితే 2028 నాటికి ఈ ఆదాయం 22 శాతానికి తగ్గిస్తామని అజెర్‌బైజాన్ చెబుతోంది. కాప్ 29 ఎజెండాలో ఒకటైన యూరోపియన్ యూనియన్ తాలూకు కార్బన్ బార్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం(కార్బన్ సర్దుబాటు వ్యవస్థ) వంటి ఏకపక్ష వాణిజ్య చర్యలు తీసుకుంటున్నారని దేశాల మధ్య వివాదం తలెత్తింది. కార్బర్ బార్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సిబిఎఎం) అంటే ఉద్గార ఇంటెన్సివ్ వస్తువులను ఎగుమతి చేసే దేశాలపై జరిమానా విధించడానికి యూరోపియన్ యూనియన్ ప్రవేశపెట్టిన కార్బన్ టారిఫ్‌ను సూచిస్తుంది.

కానీ కార్బన్ ధరలపై విధానాలు లేవు. ఐరన్, స్టీల్, సిమెంట్, ఎరువులు, అల్యూమినియం వంటి తీవ్రమైన ఇంధనాన్ని ప్రేరేపించే ఉత్పత్తులు ఎక్కువగా భారత్, చైనా నుంచే ఆయా దేశాలకు దిగుమతి అవుతుంటాయి. ఈ ఉత్పత్తుల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల ఆధారంగా పన్ను విధిస్తారు. అయితే సిబిఎఎం వల్ల కర్బన ఉద్గారాలను నిరోధించవచ్చని యూరోపియన్ కమిషన్ వాదిస్తోంది. కానీ మిగతా దేశాలు ఈ పన్ను విధానం తమ ఆర్థిక పరిస్థితికి హాని కలిగిస్తుందని, ఐరోపా దేశాలతో వాణిజ్యం మరింత భారం అవుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఐక్యరాజ్యసమితి వాతావరణ నిబంధనల ప్రకారం ఏ దేశమూ మరో దేశంపై ఉద్గారాల తగ్గింపు నిబంధనలను విధించకూడదని వాదిస్తున్నాయి. ఎజెండాలో మరో వివాదాస్పద అంశం ఏమంటే వాతారణ మార్పులపై పోరాడేందుకు తగిన ఆర్థిక సాయం. అభివృద్ధి దేశాల నుంచి రావలసిన ఆర్థిక సాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని భారత్, చైనాతో సహా ఆఫ్రికా దేశాలు కోరుతున్నాయి.

శిలాజ ఇంధనాల వాడకం మానుకోవడంతోపాటు ఇతర సమస్యలను బ్రిటన్, అమెరికా, ఐరోపా దేశాలు పరిష్కరించేలా చూడాలని కోరుతున్నాయి. ఈ సదస్సు మొదటి రోజు సోమవారం దాదాపు 200 దేశాల దౌత్యవేత్తలు ఎజెండా పోరాటంలో గడిపినప్పటికీ, చివరగా సిబిఎఎం ప్రతిపాదనను ఇతర సంప్రదింపుల ఫోరమ్‌లకు తరలించడంతో ఒక ఒప్పందం కుదుటపడడమే కాక, ఎజెండా ఆమోదించబడింది. అయితే కొంతమంది ప్రముఖ నేతలు ఈ సమావేశం నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక నిధుల కేటాయింపులు, వాణిజ్యం, తదితర ముఖ్యమైన అంశాలపై వచ్చే 12 రోజుల్లో చర్చించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. గత ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో అల్లకల్లోలమైన వర్ధమాన దేశాల డిమాండ్లను అగ్రదేశాలు నెరవేర్చవలసి ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News