గురువారం జరిగిన శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే సారథ్యంలోన అధికార నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పిపి) మెజారిటీ సాధించింది. శ్రీలంక ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం, ఎన్‌పిపి నేతృత్వంలోని కూటమి 107 సీట్లు గెలుచుకున్నది. దాదాపు 62 శాతం లేదా 6.8 మిలియన్ వోట్లు కూటమికి వచ్చినట్లు శ్రీలంక ఎన్నికల కమిషన్ వెబ్సైట్ తాజా డేటా తెలియజేసింది. దీనితో మూడింట రెండు వంతుల మెజారిటీకి కూటమి చేరువైంది. కాగా, రాజధాని కొలంబో శివార్లలో ఎన్‌పిపి మద్దతుదారుల బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస నాయకత్వంలోని సమగి జన బలవేగయ పార్టీ 28 సీట్లు గెలుచుకున్నది. పోలైన వోట్లలో ఆ పార్టీకి దాదాపు 18 వోట్లు లభించాయి.
ఇక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మద్దతు ఉన్న న్యూ డెమోక్రాటిక్ ఫ్రంట్ కేవలం మూడు సీట్లు గెలుచుకున్నది. కాగా, శ్రీలంక పార్లమెంట్లో మొత్తం 225 సీట్లు ఉన్నాయి. దామాషా ప్రాతినిధ్య విధానం ప్రకారం, 196 మంది సభ్యులను వోటర్లు నేరుగా పార్లమెంట్‌కు ఎన్నుకుంటారు, ఇక మిగిలిన 29 స్థానాలను దామాషా వోటు ప్రకారం భర్తీ చేస్తారు. పార్టీలకు వచ్చిన వోటు శాతం ప్రకారం సీట్లు కేటాయిస్తారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న కుటుంబ పార్టీలను ప్రతిపక్షానికి పరిమితం చేశారు. తాజాగా ఎన్నికల వోటింగ్ సందర్భంగా దిసానాయకే మాట్లాడుతూ, ‘ఇది శ్రీలంకకు ముఖ్యమైన మలుపుగా భావిస్తున్నాం. బలమైన ప్రభుత్వం ఏర్పాటుకు ఈ తీర్పు దోహదం చేస్తుందని ఆశిస్తున్నాం. ఈ మేరకు ప్రజలు మాకు అనుకూలంగా తీర్పు ఇస్తారని విశ్వసిస్తున్నాం’ అని చెప్పారు.