Saturday, November 16, 2024

నేనున్నా..భయపడకండి

- Advertisement -
- Advertisement -

అధికారంలోకి వచ్చాక నీ సంగతి చూస్తాం రేవంత్ ఫార్మాసిటీకి భూములు ఎక్కడ తీసుకున్నా అడ్డుకుంటాం
ఎన్ని కేసులనైనా తట్టుకుని నిలబడతాం.. రైతులు, పేదల జోలికొస్తే ఊరుకోం అమాయకులపై అక్రమ కేసులు
పెట్టారు లగచర్ల బాధితుల తరఫున పోరాడతాం.. వారి కుటుంబాలకు అండగా ఉంటాం రాజ్యాంగేతర శక్తిగా
సిఎం సోదరుడు తిరుపతిరెడ్డి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపాటు

సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న లగచర్ల బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. చిత్రంలో బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు

పదవులు శాశ్వతం కాదని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వా త సిఎం రేవంత్‌రెడ్డి సంగతి చూస్తామని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హెచ్చరించారు. వికారాబాద్, లగచర్లలో జిల్లా కలెక్టర్, పలువురు అధికారులపై ఇటీవల దాడులకు సంబంధించి సంగారెడ్డ్డి జిల్లా, కంది జైలులో ఉన్న 16 మందిని శుక్రవారం ఆయన తమ పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ములాఖత్‌లో వారితో కలిసి మాట్లాడారు. నేనున్నా.. భయపడకండి అంటూ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ.. సిఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 60లక్షలకు పైగా విలువ చేసే భూములను నామమాత్రపు ధర చెల్లించి, అల్లుడి కోసం ఫార్మాసిటీకి సేకరిస్తే రైతులు మర్లబడ్డారని వ్యాఖ్యానించారు. తమ భూములను ఇచ్చేది లేదని చెప్పిన పేదలను అన్యాయంగా కేసుల్లో ఇరికించి, జైలులో పెట్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలను, ఆరు గ్యారెంటీలను ఇప్పటివరకు అమలు చేయకపోగా, అమాయక రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

తమ పార్టీకి చెందిన కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డిపై కేసు పెట్టారని, తమ నేతలపై కేసులను ఎదుర్కొంటామని, ఎన్ని కేసులనైనా తట్టుకొని నిలబడతామని స్పష్టం చేశారు. రైతులు, పేద వర్గాల జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. లగచర్ల ఘటనలో పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారని, వారిని విడిచిపెట్టి, కేవలం బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలపై మాత్రమే సిఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేశారని, ఎక్కడైనా బయటికి చెబితే మళ్లీ కొడతామంటూ పోలీసులు బెదిరించారని పేర్కొన్నారు. మహిళలని చూడకుండా బండబూతులు తిట్టారని, విచక్షణారహితంగా చితకబాదారని ఆరోపించారు.

లగచర్ల సంఘటనకు సంబంధంలేని గ్రామ కార్యదర్శిపై, మరికొందరిపై అక్రమంగా కేసులు బనాయించి, జైలులో పెట్టారని ఆరోపించారు. వారందరి తరపున తమ పార్టీ పోరాడుతుందని, వారి కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. లగచర్ల ఘటనను నియంత్రించలేక, సిఎం రేవంత్‌రెడ్డి రాజకీయ రంగు పులిమారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా, న్యాల్‌కల్ కావచ్చు.. లగచర్లలో కావచ్చు..రాష్ట్రంలో ఎక్కడ ఫార్మాసిటీ పేరుతో భూములపైకి వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. పేదల ఉసురు రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా తగులుతుందని అన్నారు. ‘అసలు నీ పదవి ఎప్పుడు ఊడుతుందో నీకే తెలియదు, ఢిల్లీకి ఎప్పుడు కోపం వచ్చినా పదవి ఊడుతుంది గుర్తుంచుకో’ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌ఎలు మాణిక్‌రావు, చింతాప్రభాకర్, వివేకానందగౌడ్, అనిల్ జాదవ్, పార్టీ నేతలు బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, శంభీపూర్ రాజు, రవీంద్రనాయక్, క్రాంతికిరణ్ తదితరులు కెటిఆర్ వెంట వచ్చారు. కెటిఆర్ జిందాబాద్..రేవంత్‌రెడ్డి ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News