Sunday, November 17, 2024

సఫారీ గడ్డపై భారత్ జోరు

- Advertisement -
- Advertisement -

సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా ౩1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా గడ్డపై కుర్రాళ్లతో కూడిన భారత జట్టు అసాధారణ ఆటతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి బలమైన సఫారీ టీమ్‌ను చిత్తు చేసింది. టీమిండియా విజయంలో హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. కేరళ స్టార్ సంజు శాంసన్ కూడా భారత్‌కు సిరీస్ అందించడంలో తనవంతు సహకారం అందించాడు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రతిభను కనబరిచాడు. రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తదితరులు కూడా బంతితో సత్తా చాటారు. ఇలా రెండు విభాగాల్లోనూ అద్భుత ప్రతిభతో అలరించిన టీమిండియా తన ఖాతాలో మరో సిరీస్‌ను జత చేసుకుంది.

ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా దిగిన సంజు శాంసన్ అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. నాలుగు మ్యాచుల్లో ఏకంగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. తొలి టి20లో సంజు చిరస్మరణీయ శతకాన్ని సాధించాడు. సఫారీ బౌలర్లను హడలెత్తిస్తూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే క్రమంలో వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీ సాధించిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సంజు సెంచరీ సాధించాడు. అయితే రెండు, మూడు టి20లలో సంజు నిరాశ పరిచాడు. ఈ మ్యాచుల్లో అతను ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. వరుసగా రెండు సార్లు డకౌటయ్యాడు. కానీ కీలకమైన నాలుగో మ్యాచ్‌లో మళ్లీ చెలరేగి పోయాడు. ఈసారి తన మార్క్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సఫారీ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ కళ్లు చెదిరే శతకాన్ని సాధించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తిలక్‌వర్మ అండతో ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారించాడు.

అంతేగాక టి20 ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు సెంచరీలు సాధించి నయా రికార్డును నెలకొల్పాడు. అయితే కొడితే సెంచరీ లేకుంటే సున్నా అనే అపవాదును సంజు మూటగట్టుకున్నాడు. రానున్న సిరీస్‌లలో ఇలా కాకుండా ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం అతనికి ఉంది. ఇక యువ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా సత్తా చాటాడు. తొలి రెండు మ్యాచుల్లో అతను విఫలయ్యాడు. కానీ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లో మెరుగైన ఆటతో జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. కాగా, రింకు సింగ్, హార్దిక్ పాండ్య, కెప్టెన్ సూర్యకుమార్ తదితరులు ఆశించిన స్థాయిలో రాణించక పోవడం కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. బౌలింగ్‌లో మాత్రం భారత్ అసాధారణంగా రాణించింది. అర్ష్‌దీప్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు, హార్దిక్ కూడా ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవిబిష్ణోయ్‌లు కూడా అద్భుత ప్రతిభను కనబరిచారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించిన భారత్ సిరీస్‌ను దక్కించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News