Monday, December 23, 2024

ఖజానాకు ‘మహా’ హామీల భారం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి మించి ఎన్నికల్లో హామీలు ప్రకటిస్తే అమలు చేయడం చాలా కష్టమని, ఖజానా దివాళా తీసే దుస్థితి ఏర్పడుతుందని, ప్రధాని మోడీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తమ నాయకులకు పదేపదే హెచ్చరిస్తున్నా ఓట్ల కోసం మితిమీరిన వ్యయంతో కూడిన హామీలు ఇస్తుండటం పరిపాటి అవుతోంది. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, విపక్షాల మహావికాస్ అఘాడీ కూడా ఉచిత హామీలు ప్రకటించడంలో పోటీపడ్డాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కోలుకోలేని దుస్థితిలో అల్లాడుతుండగా, ఇప్పుడు ఈ ఎన్నికల ఉచిత హామీలు ఆర్థిక దుస్థితికి మరింత ఆజ్యం పోస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పరాజయం చవిచూసిన బిజెపి సంకీర్ణ మహారాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో ఊహాతీత అద్భుతమైన వరాలను కురిపించింది. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ రూ. 6,12,293 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో అనేక హామీలు కూడా ఉన్నాయి. దారిద్య్రరేఖన దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా మూడు ఎల్‌పిజీ సిలిండర్లు, రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్, ముఖ్యమంత్రి లడకీ బహిన్ యోజన పథకం కింద మహిళలకు నెలనెలా రూ. 1500 తదితర ఉచిత హామీలు బడ్జెట్‌లో చేర్చారు. అయితే ముఖ్యమంత్రి లడకీ బహిన్ యోజన పథకం ఒక్కటే ఏటా రూ. 46,000 కోట్ల వరకు ఖర్చు భరించవలసి వస్తోంది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ పథకాల వాటాలను మరింత పెంచేశారు. బిజెపి కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్టే లడకీ బహిన్ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ. 2100 వంతున ఇస్తామని ప్రకటించారు.

అంటే మరో రూ. 600 వంతున అదనపు భారం ఈ పథకం కింద మహిళలకు చెల్లించవలసి వస్తుంది. ఇదిలా ఉండగా విపక్షాలు కూడా ఈ విషయంలో వెనకడుగు వేయలేదు. మహాలక్ష్మియోజన పథకం కింద మహిళలకు నెలకు రూ. 3000 వంతున చెల్లిస్తామని ప్రకటించారు. దీంతోపాటు ఓటర్లను ఆకట్టుకోడానికి మరిన్ని ఉచిత హామీలు ప్రకటించారు. ప్రతి పార్టీ మరో పార్టీతో పోటీపడి ప్రజలకు అత్యంత విలాసవంతమైన బహుమతుల వాగ్దానాలను కురిపిస్తోంది. ఇదంతా పైపైన బ్రహ్మాండంగా కనిపిస్తున్నా లోతుకు వెళ్లి పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక గణాంకాలు అత్యవసర హెచ్చరికలను జారీ చేస్తున్నాయి. రాష్ట్ర రెవెన్యూ లోటు రూ. 20,151 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర బడ్జెట్ ద్రవ్యలోటు చాలా భయంకరంగా 2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,10,355 కోట్లకు చేరుకోవడం ఆలోచించవలసిన విషయం.

బడ్జెట్ ద్రవ్యలోటు ఇప్పటికే 2024 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు అయింది. అయితే ఇది ఎఫ్‌ఆర్‌బిఎం (ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం) పరిమితిలో ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఈ పరిమితి మించిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం అనేది ఆర్థిక క్రమశిక్షణను సంస్థాగతీకరించడానికి, దేశ ఆర్థిక లోటును తగ్గించడానికి, స్థూల ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడానికి, ప్రభుత్వ నిధుల మొత్తం నిర్వహణను సమతుల్య బడ్జెట్‌తో, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు ఉచిత హామీల భారం బడ్జెట్ సమతుల్యతను దెబ్బతీస్తోంది. 202324 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రుణభారం వార్షిక వడ్డీ చెల్లింపులు రూ. 48,578 కోట్లతో కలుపుకుని రూ. 7,11,278 కోట్లకు చేరింది. 202324లో రాష్ట్ర రుణభారం అంతకు ముందు సంవత్సరం కన్నా 16.5 శాతం మించి పెరిగినప్పటికీ, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) 17.6 శాతం నిర్దేశించిన పరిధిలోనే (జిఎస్‌డిపిలో 25 శాతం) ఉందని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

2019 నుంచి 202425 వరకు రాష్ట్ర ఆర్థిక పరిమాణం కరోనా ముందటి పరిస్థితిలా స్థిరంగానే కనిపించింది. అయితే కొవిడ్ 19 షాక్‌తో రాష్ట్రంలో ఆదాయం కన్నా వ్యయం విపరీతంగా పెరిగింది. 2023 24. 2024 25లో అత్యధిక లోటు స్థాయిలు సుదీర్ఘ కాల ఆర్థిక సుస్థిరతకు ప్రశ్నార్థకంగా తయారయ్యాయి. ఇది క్రెడిట్ రేటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ ఆర్థిక లోటు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యయం కింద అత్యధికంగా ఖర్చు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలియజేస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక లోటు పాట్లను తప్పించడానికి బలమైన ఆర్థిక కార్యాచరణ వ్యూహలు తప్పనిసరి. 202324 లో మూలధన వ్యయం వృద్ధి, ఆర్థిక లోటు పెరుగుదలతో సమానంగా కనిపించింది.

ఇది రాష్ట్రం వ్యయాలన్నిటినీ భరించడానికి రుణాలు తీసుకోవడమో లేదా ఇతర ఆర్థిక వనరులను వినియోగించుకోవడమో జరిగినట్టు స్పష్టమవుతోంది. సుదీర్ఘ కాల రుణ భారాలను తప్పించుకోవడానికి రాష్ట్రం ఆర్థిక విషయంలో తులనాత్మకంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. 202425 ఆర్థిక లోటు రెవెన్యూ తగ్గుదలకు సవాలుగా ఉంటుంది. ఆర్థిక అస్థిరత, ఇతర ఆర్థిక ప్రాధాన్యతలపై దృష్టి మళ్లించడం, రుణాలు తీసుకురావడం, సంక్షేమానికి ఖర్చు చేయడం ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక రంగానికి సవాలుగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యయాన్ని క్రమబద్ధీకరించుకోవాలని, ఆర్థిక వనరులను సమీకరించుకోవాలని కాగ్ 2023 నివేదిక కూడా మహారాష్ట ప్రభుత్వానికి హెచ్చరించడం ఆలోచించాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News