భారత్ తొలిసారి దీర్ఘ శ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణిని ఒడిశా తీరం నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షతో భారత రక్ష రంగం మరింత బలోపేతమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. వివిధ రకాల పేలోడ్లను మోసుకువెళ్లేలా దీనిని డిజైన్ చేశారు. ఇది 1500 కిలోమీటర్ల దూరంలోని లక్షాలను తుత్తునియలు చేయగలదు. ఈ విజయంతో క్రిటికల్, అడ్వాన్స్‌డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిని దేశాల చెంత భారత్ చేరిందని రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు. ఇది ఒక చారిత్రక ఘట్టమని, ఈ విజయంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని రాజ్‌నాథ్ సింగ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.
క్షిపణి గమనాన్ని జాగ్రత్తగా పరీక్షించారు. డౌన్ రేంజ్ షిప్ స్టేషన్ల నుంచి సేకరించిన ఫ్లైట్ డేటా క్షిపణి అత్యంత కచ్చితత్వంలో లక్షాన్ని ఛేదించినట్టు నిర్ధారించిందని డిఆర్‌డిఒ తెలియజేసింది. ఈ క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ మిస్సైల్ కాంప్లెక్స్‌లో డిఆర్‌డిఒ లేబరేటరీస్,ఇండస్ట్రీ భాగస్వాములతో కలసి రూపొందించారు. డిఆర్‌డిఒ సీనియర్ శాస్త్రవేత్తలు, రక్షణ దళాల అధికారుల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు డిఆర్‌డిఒ వెల్లడించింది.