మన తెలంగాణ/హైదరాబాద్ : వరంగల్ మాస్టర్‌ప్లాన్ 2041కి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మాస్టర్ ప్లాన్‌ను ఆమోదిస్తూ జీవో 202 జారీ చేసింది. ముసాయిదా మాస్టర్ ప్లాన్‌పై 2018లో వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అభ్యంతరాలు స్వీకరించింది. ఈ భూ వినియోగ జోన్లు, ఇతర నియంత్రణపై సోమవారం గెజిట్ విడుదల చేయనున్నారు.
మారనున్న వరంగల్ రూపురేఖలు..
ఇప్పటి వరకు వరంగల్ మహానగరానికి మాస్టర్ ప్లాన్ లేదు. గత రెండు, మూడేళ్లుగా కేవలం మెమో ఆధారంగా లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులను గ్రేటర్ వరంగల్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ జారీ చేస్తోంది. వరంగల్ నగరంలో పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేందుకు అధికాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మాస్టర్‌ప్లాన్ ఆమోదానికి రంగం సిద్ధం చేసింది. 2041 వరంగల్ మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. త్రినగరాలుగా పేరున్న కాజీపేట, హనుమకొండ, వరంగల్‌తో పాటుగా చుట్టూ ఉన్న 19 మండలాలు, 181 గ్రామాలు మాస్టర్ ప్లాన్ పరిదిలోకి వస్తాయి. మెుత్తం 1805 చదరపు కిలో మీటర్ల మేర పరిధిని విస్తరించారు.
జనగామ జిల్లాలోని కొన్ని మండలాలు ఈ వరంగల్ మాస్టర్ ప్లాన్‌లో కలుస్తాయి. ఇందులోనూ 13 భూ వినియోగ జోన్లు ఉండనున్నాయి. మూడు నగరాల్లో భవన నిర్మాణాలకు అడ్డంకులు తప్పనున్నాయి. దాంతో పాటుగా నగరం చుట్టూ రీజనల్, ఔటరు, ఇన్నర్, కనెక్టెడ్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. చెరువులు, నాలాల పునరుద్ధరణ వేగవంతం చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాడుతుంది. దీంతో వరంగల్ నగరంతో పాటుగా చుట్టూ ఉన్న 19 మండలాలు, 181 గ్రామాలకు మహర్దశ పట్టనుంది. గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుంటుంది. భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.