మన తెలంగాణ సాహిత్య పేజీ ఇప్పుడు కొత్తగా మీ ముందుకు రాబోతుంది. ఇకనుండి ఇది సాహిత్యకారుల, కవుల, కళాకారుల వేదిక. దేశీయ భాషలలోని, ప్రపంచ భాషలలోని సాహిత్యాన్ని మీ ముంగిటికి తీసుకువస్తుంది. వివిధ భావ సంఘర్షణలను, అవి సాగించిన ప్రయాణాలను మీకు పరిచయం చేస్తుంది. మన ప్రియ పద్యాలను, వాటి దారులను, మనం మెచ్చిన కవుల కవిత్వాన్ని, కొత్త పుస్తకాల సువాసనలను, పాత పొత్తాల మొగలిపూల పరిమళాన్ని మీకు పరిచయం చేస్తుంది. కథలను, నవలను, వస్తు, శిల్పాలను, తెలుగు సాహిత్యంలోని మలుపుల గురించి మాట్లాడుతుంది. మనం నడిచి వచ్చిన దారులలో, మన ముందు తరాల సృజనశీలురు నాటిన సాహిత్య విత్తనాలు, ఇతింతై వటుడింతై ఎదిగిన తీరులను అవలోకనం చేస్తుంది.
వట్టి మెచ్చుకోళ్లు మాత్రమే కాక, నిష్కర్షగా సాహిత్యాన్ని విమర్శించడాన్ని ఆహ్వానిస్తుంది. నాట్యం, సంగీతం, చిత్రలేఖనాలు, మనుషులలో సృజనాత్మకతను, మానవీయ హృదయ స్పందనను కలుగజేసిన జాడల గురించి అన్వేషిస్తుంది. ట్రాన్స్, క్వీర్, వివిధ అస్తిత్వవాద సాహిత్యాలను, పరిచయం చేస్తుంది. ఉర్దూ సాహిత్య సొగసును, మెరుపులను చూపే ప్రయత్నం చేస్తుంది. ఇది ఇవాల్టి మొట్టమొదటి అడుగు. ‘మన తెలంగాణ’ సాహిత్య పేజీ పేరు ఇప్పుడు ‘మెహఫిల్’ -సాహిత్యకారులు, కవులు, కళాకారుల కూడలి.
మెహిఫిల్ సృజనశీలురైన కవులు, కళాకారులకు, సాహిత్యకారులు, చిత్రకారులకు సినిమా, సాహిత్య విమర్శకులకు స్వాగతం చెబుతున్నది. మీ రచనల్ని ఆహ్వానిస్తున్నది. సాహిత్య పేజీ ‘మెహఫిల్’కి గెస్ట్ ఎడిటర్‌గా ప్రముఖ, కవి, రచయిత విమల వ్యవహరిస్తారు. -ఎడిటర్
మీ రచనలను పంపవలసిన ఇమెయిల్
mehfil.manatelangana@gmail.com