ఖరారు కాని పర్యటన తేదీలు
జూలైలో పుతిన్‌ను ఆహ్వానించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌ను సందర్శించవచ్చునని, ఉభయ దేశాధినేతల వంతుల వారీ వార్షిక పర్యటనల కోసం రెండు దేశాల మధ్య నిర్దేశించిన వ్యవస్థలో భాగంగా ఆ పర్యటన ఉండవచ్చునని దౌత్య వర్గాలు మంగళవారం తెలియజేశాయి. పుతిన్ పర్యటన అవకాశం కోసం రెండు దేశాలు చూస్తున్నాయని, కానీ తేదీలను ఇంకా ఖరారు చేయలేదని ఆ వర్గాలు తెలిపాయి. జూలైలో మాస్కోలో శిఖరాగ్ర చర్చల సమయంలో రష్యన్ అధ్యక్షుని భారత్‌కు రావలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు.
మంగళవారం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సీనియర్ భారతీయ ఎడిటర్లతో వీడియో ముఖాముఖిలో భారత్, రష్యా మధ్య గల పటిష్ఠమైన ద్వైపాక్షిక సంబంధం గురించి ప్రస్తావించారు. పుతిన్ పర్యటన జరగబోతున్నదని ఆయన చెప్పారు. అయితే, ఆయన నిర్దిష్టమైన తేదీలను వెల్లడించలేదు, పర్యటన గురించి కచ్చితమైన ప్రకటనా చేయలేదు. ప్రధాని మోడీ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు క్రితం నెల రష్యాలోని కజాన్‌ను సందర్శించారు. రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని స్ఫుత్నిక్‌ఖ వార్తా సంస్థ ఆ ము ఖాముఖిని ఏర్పాటు చేసింది. ‘పర్యటన కోసం మేము ఎదురు చూస్తున్నాం, తేదీలను పరస్పరం త్వరలోనే నిర్ణయిస్తాం’ అని పెస్కోవ్ తెలిపారు.