పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని సంయుక్త చెక్ పాయింట్ సమీపంలో పేలుడు వస్తువులతో ఉన్న ఒక వాహనాన్ని ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. ఆ తరువాత అతని సహచరులు కాల్పులకు దిగారు. ఆ ఘటనలో 12 మంది పాకిస్తాన్ సైనికులు, ఆరుగురు ఉగ్రవాదులు మరణించినట్లు సైన్యం బుధవారం వెల్లడించింది. మరి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత బన్నూ జిల్లాలో మలిఖేల్ ప్రాంతంలో సంయుక్త చెక్ పోస్ట్‌పై దాడికి ప్రయత్నించారు. కానీ చెక్ పోస్ట్‌లోకి ప్రవేశించడానికి వారు చేసిన ప్రయత్నాన్ని భద్రత దళాలు అడ్డుకున్నాయని సైన్యం మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) తెలియజేసింది.
ఆత్మాహుతి పేలుదు వల్ల ప్రహరీ గోడలో కొంత భాగం కూలిపోగా, పక్కనే ఉన్న భవనం దెబ్బ తిన్నదని, ఆ ఘటనలో పది మంది భద్రత దళాల సైనికులు. ఫ్రాంటియర్ కాన్‌స్టబులరీకి చెందిని ఇద్దరు వెరసి 12 మంది జవాన్లు మృతి చెందినట్లు ఐఎస్‌పిఆర్ తెలిపింది. ఆ తరువాత జరిగిన కాల్పుల పోరులో ఉగ్రవాదులు ఆరుగురు హతమయ్యారని కూడా ఐఎస్‌పిఆర్ తెలిపింది. క్షతగాత్రులను ఒక స్థానిక ఆసుపత్రికి తరలించారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు తిరిగి అధికారాన్ని పొందిన తరువాత పాకిస్తాన్‌లోని సరిహద్దు ప్రాంతాల వద్ద హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి.