దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్థితి ‘క్షీణిస్తోంది’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ బుధవారం ఆరోపించారు. ఆమె ఈ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను నిశితంగా విమర్శించారు. ఢిల్లీ ‘గూండాల రాజధాని’గా మారిందని ఆమె ఆరోపించారు. ఈశాన్య ఢిల్లీలోని సుందర్ నగరిలో క్రితం వారం హత్యకు గురైన 28 ఏళ్ల వ్యక్తి తల్లిదండ్రులను కలుసుకున్న అనంతరం ముఖ్యమంత్రి ఆ ఆరోపణలు చేశారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్ట పరిహారం కూడా ఆతిశీ ప్రకటించారు. సుందర్ నగరిలో ఒక మహిళను వేధిస్తున్న ఇద్దరు అన్నదమ్ములను హతుడు, అతని బంధువు నిలువరించి, మందలించిన కొన్ని నిమిషాలకు ఆ అన్నదమ్ములు శుక్రవారం రాత్రి అతనిని మెడపై కత్తి వేటు వేశాడు. హత్య అనంతరం నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
‘ఢిల్లీ గూండాల రాజధానిగా మారింది. నేరగాళ్లు, దోపిడిగాళ్లు, గూండాలకు భయం అనేదే లేదు. తాము కాల్పులు జరపవచ్చునని, ఎవరో ఒకరిని చంపవచ్చునని, ఎవరో ఒకరిని కత్తితో పొడవవచ్చునని వారు భావిస్తుంటారు. కానీ పోలీసులు ఏమీ చేయడం లేదు. ఢిల్లీలో శాంతి భద్రతల తన పరిధిలోకి వస్తున్నప్పుడు ఢిల్లీ ప్రజల కోసం ఏమి చేయబోతున్నారని ఈ దేశ హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నుంచి తెలుసుకోగోరుతున్నాను. శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తోంది. దోపిడీలు, హత్యలు ప్రతి రోజుల జరుగుతున్నాయి. అయితే, హోమ్ శాఖ మంత్రికి ఎన్నికల ప్రచారం మినహా వేరే పని ఏమీ లేదు’ అని ఆతిశీ ఢిల్లీలో విలేకరులతో అన్నారు.