భెజ్జీ ప్రాంతంలో కాల్పుల పోరు
ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సల్స్ ప్రవేశం సమాచారంతో డిఆర్‌జి ఆపరేషన్
ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఎస్‌పి కిరణ్ చవాన్ ధ్రువీకరణ
రాయిపూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని కొంటాలో భద్రత దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మరణించారు. భెజ్జీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌పి) కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. ఘటన స్థలి నుంచి భద్రత దళాలు మూడు ఆటోమేటిక్ తుపాకులు సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సలైట్లు ప్రవేశిస్తున్నారనే పక్కా సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) ఈ ఆపరేషన్ చేపట్టింది.
కాగా, ఎన్‌కౌంటర్ జరిగినట్లు బస్తర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజి) పి సుందర్‌రాజ్ కూడా ధ్రువీకరించారు. అయితే, మృతుల సంఖ్య, స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం ఇంకా కాల్పులు సాగుతూనే ఉన్నాయని ‘పిటిఐ’ వార్తా సంస్థ తెలియజేసింది. ఇది ఇలా ఉండగా, క్రితం నెల ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ దంతెవాడ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో 31 మంది మావోయిస్టులను భద్రత దళాలు కాల్చి చంపిన విషయం విదితమే. ఆ ఎన్‌కౌంటర్ సమయంలోను భద్రత దళాలు భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.