మన తెలంగాణ/హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం ‘లోక్ మంథన్’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మన దేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మన పరంపర చాలా ఘనమైనవని కొనియాడారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా శిల్పకళావేదికలో ‘లోక్ మంథన్’ను రాష్ట్రపతి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. 2018 రాంచీలో జరిగిన లోకమంథన్ లో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మరోసారి ఇక్కడ పాల్గొనే అవకాశం కలిగిందని, చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భిన్న సంస్కృతులు ఒకేచోట ఉండటం నిజంగా చాలా గొప్ప విషయమని అన్నారు.
ఇవన్నీ కలిసిన సుందరమైన ఇంద్రధనస్సు వంటి దేశం మనదని, మనం మనదేశాన్ని చూసి గర్వించాలని తెలిపారు. వనవాసి, నగరవాసి అని తేడా లేకుండా మనమంతా భారతవాసులం అనే విషయాన్ని మరవకూడదని సూచించారు. లోకమంథన్‌లో అహల్యాబాయ్ హోల్కర్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరాంగనలపై ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని తెలిసి హర్షం వ్యక్తం చేశారు. విదేశాల్లోనూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తుండటం అభినందనీయమన్నారు. ఇండొనేషియా సహా వివిధ దేశాల ప్రతినిధులు ఈ వేదిక ద్వారా తమ సంస్కృతిని ప్రదర్శిస్తుండటాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు.
భారతదేశ ఆధ్యాత్మిక భావనలు, కళలు, సంగీతలు, విద్య, వైద్య విధానాలు ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందాయని, ప్రపంచానికి మనం జ్ఞాన దర్శనం చేశామని, ప్రపంచమంతా ప్రస్తుత సమయంలో మళ్లీ భారతదేశ జ్ఞానాన్ని పంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ‘విదేశీ శక్తులు శతాబ్దాలుగా మన మీద జులూం ప్రదర్శించాయని, మన సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విధ్వంసం చేశాయని తెలిపారు. మనలో ఐకమత్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మన దేశ ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ వీటిని నిరంతరం జీవింపజేశారని, ఇకపైనా వీటిని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
భారత సంస్కృతికి ఎన్నో కుట్రలను తట్టుకుని నిలబడిన ఘన చరిత్ర ఉంది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. భారత సంస్కృతికి ఎన్నో కుట్రలను తట్టుకుని నిలబడిన ఘనమైన చరిత్ర ఉందని తెలిపారు. భాషలు, సంస్కృతులు, జీవన విధానాలు ఇలా ఎన్నో రంగాల్లో భిన్నత్వంలో ఏకత్వమున్న దేశమని కొనియాడారు. దేశ సమైక్యతను ముందుకు తీసుకెళ్లడంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు ప్రతి రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. లోకమంథన్ – 2024 మనకు మరింత మార్గదర్శనం చేసి ముందుకు నడుపుతుందనే విశ్వాసం ఉందని తెలిపారు. విదేశీ కుట్రలు తట్టుకుని నిలబడిన మనం ఐకమత్యంతో, సామరస్యంతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ రాష్ట్రం గౌరవిస్తుంది
అన్ని సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలను తెలంగాణ రాష్ట్రం గౌరవిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. లోక్ మంతన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, మోహన్ భగవత్‌కి అందరికీ మంత్రి సీతక్క హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అన్ని సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాల సమ్మేళనం హైదరాబాద్ నగరమని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం మన భారతీయత అత్యున్నత జీవన సౌందర్యమని అన్నారు. అందరం కలిసి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోని అత్యున్నతమైన దేశంగా తీర్చిదిద్దడం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.