మహారాష్ట్ర ఎన్నికల్లో సాధించిన విజయం బిజెపికి వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బలం చేకూర్చినట్లు అయింది. దేశ రాజధానిలో అఖండ విజయంతో తమ పార్టీ ఆప్ ప్రభుత్వానికి అధికార చ్యుతి కలిగించబోతున్నదని బిజెపి స్థానిక నాయకులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలో విజయం పంపిన సంకేతాలతో బిజెపి ఢిల్లీలో పది సంవత్సరాల ఆప్ పాలన అంతానికి ‘పరివర్తన్ యాత్ర’ చేపట్టనున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మోడీ మ్యాజిక్‌కు జనం ఆమోద ముద్ర వేశాయని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు.
‘హర్యానా ఎన్నికల్లో ఇటీవలి గెలుపు, ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు, యుపి ఉప ఎన్నికల్లో అఖండ విజయాలు మా నైతిక స్థైర్యాన్ని ఎంతగానో పెంచాయి. ఈ ఫలితాలతో ఉత్సాహం పొందిన పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో ఆప్ నాయకత్వంలోని అవినీతి శకాన్ని తుడిచిపెట్టేందుకు రెట్టించిన శక్తితో కృషి చేస్తారు’ అని సచ్‌దేవా ‘పిటిఐ’తో చెప్పారు. పార్టీ త్వరలో ఢిల్లీలో ‘పరివర్తన్ యాత్ర’ ప్రారంభిస్తుందని, దీనికి వ్యూహ రచన కోసం సతీష్ ఉపాధ్యాయ్ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడమైందని సచ్‌దేవా తెలిపారు.