బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాతి రెండు రోజుల్లో తమిళనాడు, -శ్రీలంక తీరాల వైపు వెళ్లవచ్చని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తరువాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని తెలుస్తోంది. మరోవైపు ఏపీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
బలపడిన అల్పపీడనం : ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అన్ని ప్రాంతాల కలెక్టర్లకు ఆదేశాలు పంపించారు. వరి పంట కోతల సమయం కావడంతో ధాన్యం తడిచిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇంకా వర్షాలకు రెండురోజుల సమయం ఉండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా నిలబడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గజగజ వణికిస్తొన్న చలి : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. రాయలసీమలో ఉష్ణగ్రతల తగ్గదల స్వల్పంగా ఉంది. అయితే పలు చోట్ల చలిగాలుల తీవ్ర పెరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి గజగజ వణికిస్తొంది. గత ఐదు రోజులుగా చలి 8 డిగ్రీలకు చేరి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాడేరులో వాహనదారులు ఉన్ని దుస్తులు ధరిస్తే గాని చలిని తట్టుకోలేని పరిస్థితి. ఉదయం 10 గంటల వరకు కూడా పొగ మంచు వీడటం లేదు. ఆ సమయం వరకు వాహనదారులు లైట్ల వెలుతురులోనే ప్రయాణిస్తున్నారు. కొన్నిచోట్ల పొగ మంచు జల్లులా కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగవచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.