రాష్ట్రంలో కనిష్టస్థాయికి ఉష్ణోగ్రతలు
పెరుగుతున్న జలుబు, దగ్గు, జ్వరం,
గొంతునొప్పి బాధితులు ఆసుపత్రులకు
వరుస కడుతున్న న్యుమోనియా,
ఆస్తమా, గుండెజబ్బు రోగులు
చెస్ట్, ఉస్మానియా, గాంధీ, ఫీవర్
ఆసుపత్రులకు రోగుల తాకిడి
ముందుజాగ్రత్తలు పాటించాలని
వైద్య నిపుణుల సూచనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో చలి క్రమంగా పెరుగుతోం ది. హైదరాబాద్ సహా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. వాతావరణంలో మార్పులు.. చలి తీవ్రత వల్ల రాష్ట్రంలో మ ళ్లీ జ్వరాల తీవ్రత పెరిగింది. జలుబు, దగ్గు జ్వరాలు, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులతో బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గ తం వారం పది రోజులుగా ఎక్కడ చూసినా దగ్గు, జలుబు, తు మ్ము లు, ఫ్లూ సమస్యలతో బాధపడుతున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో క్రమంగా చలి పెరుగుతుంటే, మరోవైపు జ్వరాలు దడపుటిస్తున్నాయి. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా జ్వరాల తో జనం సతమతమవుతున్నారు.
ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే కు టుంబ సభ్యులందరినీ చుట్టుముట్టేస్తోంది. అయితే రాష్ట్రంలో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు తగ్గుముఖం పడుతుండగా, చల్లటి వాతావరణంతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరం, ఆయాసం, కేసులు పెరుగుతున్నాయి. అస్త మా, సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ప ల్మనరీ డీసీజ్), అలర్జీ, న్యుమోనియా తదితర శ్వాసకోశ వ్యాధుల ము ప్పు పొంచి ఉంది. శ్వాసకోశ వ్యాధులతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ త్వరగా దాడి
చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెస్ట్, ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల ఓపీ విభాగానికి వచ్చే రోగుల్లో సీజన్‌కు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. చిన్నారులపై చలి తీవ్ర ప్రభావం చూపిస్తుందని చిన్న పిల్లల వైద్యులు తెలిపారు. నీలోఫర్ సహా ఇతర పీడియాట్రిక్ విభాగాలకు వచ్చే ఓపి క్రమంగా పెరుగుతోంది.
-అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
వాతావరణ మార్పులతో చల్లటి గాలులకు శరీరం తెల్లగా పొడిబారినట్లు మారిపోతోంది. పెదవులు పగిలిపోయి, ముఖం కాంతి హీనంగా మారుతోంది. అరికాళ్లు పగుళ్లు ఏర్పడుతున్నాయి. శరీరంలో తేమ శాతం తగ్గడంతో చర్మ రక్షణ శక్తి తగ్గి దురదలు వస్తాయంటున్నారు. ముఖంపై పొడిబారిపోవడం వల్ల పగుళ్లు వస్తాయని వైద్యులు వివరించారు. చేతులపై పగుల మాదిరిగా తెల్లటి గీతలు వస్తాయంటున్నారు. ఈ తరహా సమస్యలు మధుమేహం రోగులకు వస్తే ఇబ్బందులుంటాయని, ఇన్ఫెక్షన్ పెరుగుతుందని పేర్కొంటున్నారు. వాతావరణం మార్పుతో వైరస్ శక్తివంతం కావడంతో ప్రజలపై దాడి చేస్తోంది. దీంతో దగ్గు, ఆయాసం, గాలి పీల్చుకోవడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. ఐదారు రోజుల్లో తగ్గే జబ్బు, అలర్జీలు ప్రస్తుతం వారం నుంచి రెండు వారాలు ఉంంటున్నాయని వైద్యులు తెలిపారు. న్యుమోనియా, అస్తమా వంటి జబ్బులు కూడా పెరిగాయంటున్నారు.
అస్తమా ఉంటే అవస్థే
అస్తమా, న్యుమోనియా, సిఒపిడి, గుండె వ్యాధులతో బాధపడే వారికి చలికాలం కష్టమేనని వైద్యులు అంటున్నారు. చల్లటి ప్రదేశంలో తిరిగినా, చల్లటి ఆహారం తీసుకున్నా, ఎసి గదుల్లో ఉన్నా అస్తమా సమస్య పెరుగుతుంది. చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తే అస్తమా, న్యుమోనియా రోగులకు మరింత అసౌకర్యంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అస్తమా, న్యుమోనియాతో బాధపడేవారు మందులు వాడకపోతే సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గుండె జబ్బు బాధితులు జాగ్రత్తగా ఉండాలి
చలికాలంలో గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. బ్లాక్స్, కొలెస్ట్రాల్ ఉన్న వారిలో రక్తనాళాల్లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉండడంతో గుండె వైఫల్యం చెందే ముప్పు ఉంటుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ల వల్ల కూడా రక్తనాళాలు రప్చర్ అవుతుంటాయి. అధిక బరువు, అస్తమా, గుండె జబ్బులున్న వారు వాకింగ్ విషయలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ బాధితులు అప్రమత్తంగా ఉండాలని, మధుమేహ రోగులు చల్లటి ప్రదేశంలో పడుకోవద్దని, పొగమంచు బారిన పడకుండా ఉండడానికి మాస్కులు ధరించాలని, గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలని, చలిగాలి ఉన్న సమయంలో పిల్లలు, వృద్ధులు బయట తిరగొద్దని పేర్కొంటున్నారు.
నీరు వేడిచేసి తాగాలి
శ్వాసకోశ, చెవి, ముక్కు, గొంతు సమస్యలున్నవారు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు వేడిచేసి వడపోసుకుని తాగాలని, వెచ్చని దుస్తులు, శరీరం పూర్తిగా కవర్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు తీసుకోవద్దని, గొంతునొప్పి ఉన్న వారు ప్రతిరోజూ రెండుసార్లు వేడి చేసిన నీటిలో కొంచెం ఉప్పు వేసి వాటిని పుక్కిలించి ఉమ్మి వేయాలని, ఇలా ఉదయం సాయంత్రం చేస్తే గొంతు నొప్పి తగ్గే అవకాశముందని పేర్కొంటున్నారు. ఫ్రిజ్‌లో పెట్టిన నీరు తాగొద్దని, వేడి ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఇఎన్‌టి సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించి వారి సలహాలు పాటించాలని సూచిస్తున్నారు.