డిసెంబర్ చివరినాటికి 8వేల మంది
ఉద్యోగుల రిటైర్మెంట్ ఒక్కో
ఉద్యోగికి సగటున రూ.30
నుంచి రూ.50లక్షలు చెల్లింపు
ప్రతి ఏటా రూ.5వేల కోట్లు
అవసరమని ఆర్థికశాఖ అంచనా
మన తెలంగాణ / హైదరాబాద్ : సర్కారుకు ప్ర భుత్వ ఉద్యోగుల పదవీ విరమణ గండం పొంచి ఉంది. డిసెంబర్ చివరి నాటికి 8 వేల మంది ఉ ద్యోగుల పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో ఒక్కో ఉద్యోగికి సగటున 30 నుంచి 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకో సం దాదాపు ప్రతి ఏటా దాదాపు రూ.5వేల కో ట్లు అవసరం అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అసలే ఆర్ధిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి మరో టెన్షన్ పట్టుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడమా లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను బాండ్స్ రాసివ్వడమా.? నెలవారీగా చెల్లించడమా అన్న డైలమాలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఏకంగా 8వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో 4వేల మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు.
కలవరపెడుతున్న ఉద్యోగుల రిటైర్మెంట్ :
ఆరు గ్యారెంటీల అమలు..సంక్షేమ పథకాలు..అప్పులకు వడ్డీలు-, ఇన్స్టాల్ మెంట్స్ ఇలా తలకు మించిన భారంతో అసలే ఆర్ధిక కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు టెన్షన్ వచ్చి పడింది. ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం రేవంత్ సర్కార్‌ను కలవర పెడుతోంది. ఈ ఏడాది చివరకు పదవీ విరమణ కానున్న 8 వేల మంది ఉద్యోగులతో పాటు వచ్చే ఐదేళ్లలో రిటైరవుతున్న 44 వేల మంది ఉద్యోగులకు బెనిఫిట్స్ ఎలా చెల్లించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల వయో పరిమితిని 58 నుంచి 61 ఏళ్లకు పెంచారు. వారి రిటైర్మెంట్ గడువు ఈ సర్కార్ హయాంలో ముగుస్తుంది. దీంతో ఒక్కసారిగా రిటైర్ అవుతున్న ఉద్యోగుల భారం రేవంత్ ప్రభుత్వంపై పడుతుందని అంటున్నారు. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ చాలానే ఉంటాయి.
వారి బేసిక్ పేకు అనుగుణంగా హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలను కలుపుకుని మొత్తం వేతనానికి 10 రెట్లు లీవ్ శాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లీవ్ శాలరీల మొత్తం ఒక్కో ఉద్యోగికి సగటున 8 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అలాగే గ్రాట్యుటీ కింద 12 లక్షలు, కమ్యుటేషన్ రూపంలో మరో 20 లక్షల రూపాయలు చెల్లించాలి. వేతనం నుంచి నెలనెలా దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సురెన్స్, సరెండర్ లీవ్‌లు అన్ని కలుపుకుని ఒక్కో ఉద్యోగికి సగటున 30 నుంచి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు 5 వేల కోట్ల రూపాయలు అవసరం : 2025 డిసెంబర్ నాటికి దాదాపు 10 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో 2026, 2027లోనూ దాదాపు 10 వేల మంది చొప్పున ఉద్యోగులు పదవీ విరమణ కానున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2028 లో మరో 8 వేల మంది పదవీ విరమణ చేస్తారు. ఇలా రిటైర్ అవుతున్న ఉద్యోగులకు చెల్లించడానికి ప్రభుత్వానికి అదనంగా ప్రతి సంవత్సరం దాదాపు 5 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆర్ధిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే నెలకు తక్కువలో తక్కువ 400 కోట్లు వీరికే కేటాయించాల్సి ఉంటుంది.
ఈ సంవత్సరం ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు ఈ డిసెంబర్లో రిటైరవుతున్న ఉద్యోగులకు దాదాపు 3, 200 కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. అసలే ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించే పరిస్థితుల్లో లేదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏజ్ లిమిట్‌ను పెంచడమే ఇప్పుటి పరిస్థితికి కారణమన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కేసీఆర్ 58 నుంచి 61 ఏళ్లకు పెంచారు. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31 వరకు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు దాదాపు జరగలేదు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాళ్లకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం రాలేదు. కేసీఆర్ హయాంలో మూడేళ్ల పాటు రిటైర్మెంట్లు లేకపోవడం, రేవంత్ అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే పదవీ విరమణలు మొదలు కావడంతో ఒక్కసారిగా భారం మీద పడుతోంది. రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్ పే చేయడం కాంగ్రెస్ సర్కార్‌కు కష్టంగా మారిందని తెలుస్తోంది.
వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.20 వేల కోట్ల భారం :
ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 జులైకి సంబంధించిన డీఏ ప్రకటించింది. ఇంకా మరో నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులు సాధారణ జీవిత బీమా కింద జమ చేసుకున్న ఫండ్స్‌ను వాడుకుంది. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు వారి జీఎల్ఏ పాటు జీపీఎఫ్ ఇంట్రెస్ట్ కూడా చెల్లించాల్సి వస్తోంది. ఇవన్నీ రేవంత్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారాయని తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఏకంగా 44 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. వీళ్లందరికి రిటైర్మైంట్ బెనిఫిట్స్ కింద సగటున 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాలి. అంటే వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రభుత్వంపై దాదాపు 20 వేల కోట్ల రూపాయల భారం పడవచ్చని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అందుకే ప్రత్యామ్నాయా మార్గాలను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.