అదానీ గ్రూపుపై వచ్చిన అవినీతి ఆరోపణలను పార్లమెంట్ ఉభయ సభలలో సభాపతులు 267 నిబంధన కింద చర్చించేందుకు ప్రతిపక్షానికి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసే ఈ వ్యవహారంలో నిజాలు బయటకు వచ్చేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. 267 నిబంధన కింద అత్యవసర అంశాన్ని చర్చించేందుకు సభాపతి అనుమతితో ఇతర సభా కార్యకలాపాలను రద్దు చేయవచ్చని ఆయన తెలిపారు. సోమవారం 267 నిబంధన కింద సభ్యులు అందచేసిన 13 నోటీసులను రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖఢ్ తిరస్కరించారు.
వీటిలో అదానీ గ్రూపుపై అమెరికాలో దాఖలైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఏడు నోటీసులు ఉన్నాయి. లోక్‌సభలో కూడా ఇటువంటి నోటీసులు తిరస్కరణకు గురయ్యాయి. కాగా..తమపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. కాగా..విదేశాలలో కొందరు ముఖ్యమైన వ్యాపారవేత్తలకు కాంట్రాక్టులు దక్కడంలో సాయపడి దేశ ప్రతిష్టను నాశనం చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఖర్గే విరుచుకుపడ్డారు. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) వేయాలని కూడా ఆయన ఎక్స్ వేదికగా డిమాండు చేశారు.