ప్రీ లాంచ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన మరో కేసు సైబరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. భార్యభర్తలు కలిసి 200మంది బాధితుల నుంచి రూ.48కోట్లు వసూలు చేసి నిండా ముంచారు. ఇద్దరిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…చక్కా భస్కార్ ఆర్ హోంమ్స్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎఎస్ రాజు నగర్, కూకట్ పల్లిలో ఆఫీస్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌గా ఉన్నాడు.భాస్కర్ భార్య సుధారాణి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇద్దరు కలిసి మల్కాజ్‌గిరి మేడ్చల్ జిల్లా, ఘట్‌కేసర్ మండలం, యమ్నాంపేట గ్రామానికి చెందిన బ్లిస్ హైట్స్ ప్రాజెక్ట్, పటాచెరువు మండలం, కర్దానూర్ గ్రామంలో ఓఆర్‌ఆర్ హైట్స్ ప్రాజెక్ట్, కారాముంగి గ్రామంలో ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ పేరుతో 2 బిహెచ్‌కే, 3 బిహెచ్‌కే అపార్ట్‌మెంట్లు కడుతున్నామని,
ఆరు నెలల్లో నిర్మాణం పూర్తవుతుందని చెప్పి ప్రీలాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేశాడు. నిర్మాణం త్వరగా పూర్తవుతుందని భావించిన బాధితులు నిందితుడి మాయమాటలు నమ్మి 200మంది రూ.48కోట్లు కట్టారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అపార్ట్‌మెంట్లు వస్తున్నాయని ఆశ పడిన బాధితులు చాలా మంది డబ్బులు చెల్లించారు. డబ్బులు కట్టి చాలా రోజులు అవుతున్నా కూడా నిర్మాణాలు చేపట్టకపోవడంతో బాధితులు నిలదీశారు, దీంతో నిందితుడు పరారయ్యాడు. కొంపల్లికి చెందిన వడ్లమూడి మనోజ్ కుమార్ అపార్ట్‌మెంట్ కోసం నిందితులకు 2020 నుంచి 2021 వరకు రూ.65,50,000 చెల్లించాడు. బాధితుడు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎసిపి సోమనారాయణ కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.