గత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని సరిగా అమలు చేయలేదు. అన్ని రంగాల్లో విలువలు పతనమయ్యాయి. అవినీతి పెరిగింది. ఎన్నికల్లో ధనకండబలాలు పెరిగాయి. నేరరాజకీయీకరణ, రాజకీయ నేరమయం జరిగాయి. కులమత విభజన ధోరణు లు చొరబడ్డాయి. రాజ్యాంగ పీఠిక లక్ష్యాలు సాధించబడలేదు. సామాజిక సేవాదృక్పథంతో, త్యాగంతో నిండవలసిన రాజకీయాలు లాభసాటి వ్యాపారం గా, లూటీ వ్యవస్థగా మారాయి. రాజకీయులు ఊసరవెల్లులయ్యారు. పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆరోగ్యం, నీరు, ఆహార సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రభుత్వాల బలం, స్థిరత్వం ప్రజాశ్రేయస్సుకు కాక బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు ఉపయోగపడ్డాయి.నిన్నటిదాకా నీతిజ్ఞులు కాని రాజకీయులు దేశాన్ని పాలించారు. నేడు పుక్కిటి పురాణాల, ఊహాగాథల, అసత్య భావజాల తాత్విక, మతాధార సమాజ విభజన మతాంధులు పాలిస్తున్నారు. రాజకీయ సామరస్యత, సమన్వయాలు, సామాజిక నిర్మాణం, శాంతి భద్రతల నిర్వహణ, ఆర్థిక అభివృద్ధి, దేశసమైక్యత, సమగ్రతల్లో వీరు ప్రజాకంఠకులు.
నేడు ప్రజాస్వామ్యం పతనతమ స్థాయికి, రాజ్యాంగం ప్రమాదతమ స్థితికి చేరాయి. 26 నవంబర్ 1949న రాజ్యాంగ ఆమోద సభలో మంచి రాజ్యాంగమైనా అమలు చేసేవారు చెడ్డవారైతే రాజ్యాంగం చెడుగా మారుతుంది. రాజ్యాంగం చెడ్డదైనా అమలుచేసేవారు మంచివారైతే మంచిగా మారుతుంది. ప్రజల మీద, లక్ష్య సాధన, రాజ్యాంగ అమలుకు వారు స్థాపించుకునే రాజకీయ పక్షాల మీద రాజ్యాంగ వ్యవస్థల పనితీరు ఆధారపడుతుంది. దేశం మతాతీతంగా ఉండాలి. మతం రాజ్యాన్ని అతిక్రమిస్తే స్వాతంత్య్రం రెండోసారి ప్రమాదంలో పడుతుంది. శాశ్వతంగా దూరమవుతుంది. చివరి రక్తం బొట్టు దాకా స్వాతంత్య్రాన్ని కాపాడుకోటానికి తీర్మానించుకోవాలి అని రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు అంబేడ్కర్, పాలకులు యోగ్యులు, సమగ్రత నిబద్ధులు, గుణవంతులు అయితే లోపభూయిష్ట రాజ్యాంగాన్ని కూడా ఉత్తమంగా మార్చగలరని రాజ్యాంగ నిర్మాణసభ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ వివేకవంతమైన హెచ్చరికలు చేశారు. హిందుత్వవాది ప్రసాద్ కూడా సరిగ్గా వ్యాఖ్యానించారు.
నిన్నమొన్నటి పాలకులు కొందరు చెడుగా, కొందరు అధ్వానంగా ఉన్నారు. నేటి పాలకులు అతిదుష్టులు. ప్రజాచైతన్య సంస్థలు, పక్షాలు బలహీనపడ్డాయి. రాజకీయ పక్షాలు వ్యాపార క్షేత్రాలయ్యాయి. నేటి పాలక పక్షాలు మతమౌఢ్య అడ్డాలు. రాజ్యాంగ వ్యవస్థల పనితీరు అధ్వానమైంది. నేటి పాలకుల పూర్వీకులు దేశ విభజన కోరుకున్నారు. ముస్లింలు పాకిస్తాన్‌కు వెళతారని హిందువులు మాత్రమే మిగిలి భారత్ హిందూ దేశమవుతుందని ఆశించారు. వారి ఆశలు నెరవేరలేదు. పాశువిక ఆధిక్యతతో నేడు అధికారం పట్టిన మతాంధ వారసులు దేశాన్ని హిందూ దేశంగా మార్చుతున్నారు. వీరికి రాజేంద్రప్రసాద్ ప్రస్తావించిన యోగ్యత, సమగ్రతా నిబద్ధత, గుణగణాలు లేవు. మతం రాజ్యాన్ని అతిక్రమించింది. అందుకే రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడింది. దేశ వ్యవస్థాపక పితామహులు విశిష్టత కలవారు.
వివేకవంతులు. న్యాయవేత్తలు. దేశభక్తులు. స్వాతంత్య్ర సమరయోధులు. మత అత్యాచార హత్యలు, మతాధిక్య కేంద్రీకరణతో, అల్ప మతస్థులను భయాందోళనలకు గురిచేసి అధికారం అందుకున్న మత ప్రచారకుల్లో ఈ గుణాలుండవు. మన రాజ్యాంగం ఆంగ్లేయ పాలనను తిరస్కరించింది. ఆంగ్లేయ సంస్థలను కొనసాగించింది. ఫలితంగా సామ్రాజ్యవాదం కొనసాగింది. 1990లలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మొదలైంది. వీటిని నిన్నటి పాలకులు పాటించారు. నేటి పాలకులు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సామ్రాట్ అమెరికాకు దాసోహమయ్యారు. స్వాతంత్య్రం, స్వావలంబన సంక్షోభంలో పడ్డాయి. భారత రాజ్యాంగ పీఠిక: భారత ప్రజలమైన మేము భారత దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవం, జాతి ఐక్యత, అఖండతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ఈ పీఠిక రాజ్యాంగ మౌలిక రూపం. 1973 కేశవానంద భారతి – కేరళ ప్రభుత్వం కేసులో రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని, మౌలిక స్వరూపాన్ని మార్చరాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రాజ్యాంగ సవరణలు, చట్టాలు రాజ్యాంగ పీఠికలోని అంశాలకు కట్టుబడి ఉండాలి.
నేటి ప్రభుత్వ చట్టాలు, సవరణలు ఈ పీఠికకు తూట్లుపొడిచాయి. నేటి పాలకులు ప్రజా రాజ్యాంగాన్ని పాలక గ్రంథంగా మార్చారు. సర్వసత్తాక పదానికి అర్థం మార్చారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ దోపిడీలను సామ్యవాదం నిరోధిస్తుంది. నేటి పాలకులు ఆదాయ తారతమ్యాలను పెంచారు. వాణిజ్యవేత్తలకే ఉద్దీపనలు ఇచ్చారు. సామాన్యులను ఇబ్బందిపెట్టారు. దోపిడీ పెంచారు. సామ్యవాద భావాన్ని హత్యచేశారు. రాజ్యం మతాతీతంగా ప్రవర్తించటం, హేతు, భౌతిక, మానవవాదాలను ప్రోత్సహించటం లౌకిక లక్షణం. నిన్నటి ప్రభుత్వాల్లో నిర్వీర్యమైన లౌకిక భావం నేటి పాలనలో మాయమైంది. దేశాన్ని హిందురాజ్యంగా మార్చే పనులు పెరిగాయి. పౌరసత్వ సవరణ చట్టంలో లౌకికత్వం పతనమైంది. ఎస్‌ఆర్ బొమ్మై- భారత ప్రభుత్వం కేసులో, బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో, లౌకికత్వాన్ని మంటగలిపిన బిజెపి ప్రభుత్వాల రద్దును 1994 సుప్రీంకోర్టు తీర్పు సమర్థించింది.
మతమౌఢ్య మోడీ, -షా ప్రభుత్వ అలౌకిక తాత్వికత దుర్మార్గమైంది. మతాచారాలను, మత కార్యకలాపాలను క్రమబద్ధీకరించవచ్చు, నియంత్రించవచ్చన్న 25 (2) అధికరణను తుంగలో తొక్కారు. సామ్యవాద, లౌకిక పదాలనే రాజ్యాంగం నుండి తొలగిస్తామన్నారు. ఈ పదాల వాడకం మానేశారు. ప్రజాస్వామ్యం స్థానంలో ఏకఛత్రాధిపత్యం, నియంతృత్వం ఏలుతున్నాయి. నిర్ణీత కాలానికి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ప్రభుత్వమే గణతంత్రం. ఈ ప్రభుత్వం గణతంత్రాన్ని నాశనం చేసింది. గణతంత్ర వేడుకలను కాషాయీకరిస్తోంది. మార్క్సిజం పట్ల జనాకర్షణకు కారణం దాని శాస్త్రీయ సిద్ధాంతం కాదు. సామాజక న్యాయ తపన అని నెహ్రూ అన్నారు. నేడు న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి నల్లపూస. భ్రమభయాలు, ఆశలతో ప్రభుత్వం న్యాయమూర్తులను లొంగదీసుకుంది. అన్నీ ఏకగ్రీవ తీర్పులే. అసమ్మతి ఆనవాళ్ళు కనిపించవు. తన దుశ్చర్యలను ప్రశ్నించినవారిని, తాత్వికతను ఆమోదించని వారిని ప్రభుత్వం తప్పుడు కేసులతో అరెస్టు చేసింది. శిక్షించింది. హత్యలు చేయించింది. స్వేచ్ఛకు సంకెళ్ళు వేసింది. రాజ్యాంగ సమానత్వ అధికరణలు 14- 18లను తిరస్కరించింది. సంఘీయులనే పదవుల్లో, అధికారాల్లో నియమించింది.
ప్రజల వ్యక్తి గౌరవాన్ని మంటగలిపింది. వీరి జాతి ఆర్యజాతి. మతం హిందువాదం. వీరి ఐక్యత అఖండతలు ఇవే. భారతీయ సౌభ్రాతృత్వం, అంతర్జాతీయ మానవత్వం లేకుండా దేశ సమైక్యత, సమగ్రతలకు సంపూర్ణత లేదు. లౌకికత్వాన్ని మించిన పవిత్రత గల సౌభ్రాతృత్వాన్ని హిందుత్వానికి ముడేసింది. హిందూయేతరులను తిరస్కరించి భారతీయ సౌభ్రాతృత్వ భావనకు తూట్లు పొడిచింది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. కాషాయీకరించింది. దేశ సమాఖ్య స్వభావానికి గండికొట్టింది. సంఘీయులు మహిళలను అవమానించారు. బాబాలను, అమ్మలను, గోడ్సే భక్తులను ప్రోత్సహించారు. ప్రజాప్రతినిధులను చేశారు. ఈ పనులన్నీ సంఘ్ సిద్ధాంతకర్త గోల్వాల్కర్ ప్రవచించినట్లు రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుస్మృతిని రుద్దడానికే.అందుకే ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్నే కాదు దేశాన్నే భ్రష్టుపట్టించింది. రాజ్యాంగ నిర్మాత ఆంబేడ్కర్ సూచించినట్లు దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదే. రాజ్యాంగ రక్షణకు పౌరసమాజం నడుం బిగించాలి.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
94902 04545