బెంగళూరు: నిధుల కొరత కారణంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీలను నిలిపేయాలని ఓ బహిరంగ సమావేశంలోనే కర్నాటక కాంగ్రెస్ ఎంఎల్ఏ ఒకరు ముఖ్యమంత్రిని కోరారు. దీనిని ఉపముఖ్యమంత్రి డికె. శివకుమార్ తీవ్రంగా పరిగణించారు. ఆ ఎంఎల్ఏకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. గ్యారెంటీలని నిలిపేయబోమని స్పష్టం చేశారు.
ఓ కార్యక్రమంలో విజయనగర ఎంఎల్ఏ హెచ్.ఆర్. గవియప్ప కొన్ని హామీలను నిలిపేయాలని సిఎంను కోరారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆర్థిక భారంగా మారిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయడం చాలా కష్టం అన్నారు. హామీలను రద్దు చేస్తే అప్పుడు ప్రజలకు కనీసం ఇళ్లయినా ఇవ్వగలమన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని సిఎంకే వదిలేస్తామన్నారు.
ఇదిలావుండగా పార్టీకి చెందిన ఎంఎల్ఏ గవియప్ప వాదనతో ఉపముఖ్యమంత్రి డికె. శివకుమార్ విభేదించారు. తమ ప్రభుత్వం ఏ హామీ విషయంలోనూ వెనక్కి తగ్గదన్నారు. హామీలు రద్దు చేయాలన్న పార్టీ ఎంఎల్ఏకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం హామీలకు కట్టుబడి ఉందన్నారు.