Sunday, January 5, 2025

మీ సేవారంగం వేరు..ఈ రాజకీయాలు ఎందుకు?: కెఎ పాల్ పిల్ కొట్టివేసిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో జరిగే ఎన్నికలలో బ్యాలట్ పేపర్ల ఓటింగ్‌కు తిరిగి మరలాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పిబి వరాలేతో కూడిన ధర్మాసనం ఎన్నికలలో గెలుపొందితే ఇవిఎంలు ట్యాంపర్ కాలేదని చెప్పడం, ఎన్నికలలో ఓడిపోతే ఇవిఎంలు ట్యాంపర్ అయ్యాయని ఆరోపించడం సర్వసాధారణమని వ్యాఖ్యానించింది. బ్యాలట్ పేపర్ ఓటింగ్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని కోరడంతోపాటు ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువులను పంచుతున్నట్లు తేలితే అభ్యర్థులను కనిష్ఠంగా ఐదేళ్లపాటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఎన్నికలలో అవినీతిని నిర్మూలించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ను దాఖలు చేసినట్లు కెఎ పాల్ తెలియచేయగా మీ పిల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయని ధర్మాసనం వ్యంగ్యంగా ప్రశ్నించింది.

లక్షలమందికి పైగా అనాథలను, 40 లక్షల మంది వితంతులను కాపాడిన స్వచ్ఛంద సంస్థకు తాను అధ్యక్షుడినని పాల్ చెప్పుకోగా రాజకీయ బరిలోకి మీరు ఎందుకు వస్తున్నారని, మీ కార్యక్షేత్రం ఇందుకు పూర్తి భిన్నమైనదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాను 150కి పైగా దేశాలు పర్యటించానని పాల్ తెలియచేయగా మీరు పర్యటించిన దేశాలలో ఎక్కడకెక్కడ బ్యాలట్ పేపర్లు లేదా ఇవిఎంలు ఉపయోగిస్తున్నారో వివరించాలని ధర్మాసనం కోరింది. చాలా దేశాలు బ్యాలట్ పేపర్ ఓటింగ్‌ను అమలు చేస్తున్నాయని, భారత్ కూడా అదే విధానాన్ని అమలు చేయాలని పాల్ జవాబిచ్చారు. ఇతర దేశాలకు భిన్నంగా మనం ఎందుకు ఉండకూడదు అని ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. మన దేశ ఎన్నికల వ్యవస్థ అవినీతిమయంగా మారిందని, ఈ ఏడాది జూన్‌లో రూ. 9,000 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ స్వయంగా ప్రకటించిందని పాల్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అయితే..మీరు కోరుకున్న ఆదేశాలు జారీచేసినంత మాత్రాన మార్పు ఎలా సాధ్యమవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది.

బ్యాలట్ పేపర్‌కు మారినంత మాత్రాన అవినీతి అంతం అవుతుందా అని కూడా ధర్మాసనం నిలదీసింది. దీనికి పాల్ స్పందిస్తూ ఇవిఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని టెస్లా సిఇఓ, సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చెప్పారని అన్నారు. ఇవిఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యమేనని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను పాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ గతంలో ఎన్నికలలో ఓటమి చెందిన సందర్భంగా ఇవిఎంలను ట్యాంపర్ చేయవచ్చని చంద్రబాబు నాయుడు చెప్పారని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా అదే మాట చెబుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికలలో డబ్బు పంచిన సంగతి అందరికీ తెలుసునని పాల్ చెప్పగా ఏ ఎన్నికలలో తమకు డబ్బు ముట్టలేదని న్యాయమూర్తులు జవాబిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News