పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేయడానికి 2019 జనవరిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సిఎపి)ను ప్రారంభించినా, గత ఐదేళ్లలో అనుకున్న ఫలితాలు సాధించలేదు. తక్కువ కాలుష్యం కలిగిన నగరాలకు ఈ పథకం కింద నిధులు భారీగా కేటాయించారు. ఈ కార్యక్రమం లక్షం రోడ్డు దుమ్మును నివారించడం. అంతేతప్ప ప్రస్తుతం పీడిస్తున్న వాయు కాలుష్యం తదితర ఇతర కాలుష్యాల నివారణ ప్రసక్తి ఇందులో చేర్చలేదు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఈ ఎన్‌సిఎపి ని ప్రారంభించింది. 2024 నాటికి కాలుష్య రేణువుల పిఎం 2.5, పిఎం 10 స్థాయిలను 2024 నాటికి 20 నుంచి 30 శాతం వరకు తగ్గించాలన్నదే ఈ పథకం లక్షంగా నిర్దేశించారు. అయితే ఈ లక్షాన్ని 2025 వరకు పొడిగించారు.
దేశంలో వాయు నాణ్యత సూచిక 8 కాలుష్య కారకాలతో రూపొందించబడింది. అవి పిఎం 10, పిఎం 2.5, ఎన్‌ఒ 2, ఎస్‌ఒ 2, కార్బన్ మోనాక్సైడ్ (సిఒ.03), ఎన్‌హెచ్3, పిబి తదితర కాలుష్య కారకాలను పేర్కొన్నారు. వాయు కాలుష్య ప్రధాన భాగాలు గాలిలో ఉండే పిఎం 2.5, పిఎం 10 కణాలు. ఈ కణాల స్థాయి గాలిలో పెరిగినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. వాయు నాణ్యత సూచిక 050 మధ్య ఉంటే అది మంచిగానే పరిగణిస్తారు. అలాగే 51100 మధ్య ఉంటే సంతృప్తికరంగా పరిగణిస్తారు. 101200 మధ్య ఉంటే మధ్యస్తంగా పరిగణిస్తారు. 201300 కొంత ప్రమాదకరంగా, 301400 ఉంటే మరీ ఎక్కువగా, 401500 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే పరిస్థితి తీవ్రంగా పరిగణిస్తారు. ఢిల్లీలో గాలి నాణ్యత కొన్ని సార్లు 500 దాటుతుంది.
పిఎం అంటే ఘన, ద్రవ కాలుష్య అణువులు గాలిలో తేలియాడుతుండడం. పిఎం 10 స్థాయి అంటే ఘనపు మీటర్‌కు 60 మైక్రోగ్రాములు కన్నా ఎక్కువగా ఉండడం. ఇలా ఉంటే గాలి నాణ్యత బాగా క్షీణించిందని అర్థం. ఈ నేపథ్యంలో ఎన్‌సిఎపి కింద 2019 నుంచి 2024 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలకు రూ. 10,595 కోట్లు కేటాయించారు. మొత్తం 131 నగరాలను లక్షంగా చేశారు. ఈ కేటాయింపులో రూ. 65.3 శాతం అంటే రూ. 6922 కోట్లు వినియోగమయ్యాయి. అయినా సరే గత ఐదేళ్ల సరాసరి పర్టిక్యులేట్ మాటర్ 10 (పిఎం 10) ఇంకా సురక్షిత పరిధి 60ని మించి విస్తరించింది. ఆయా నగరాల్లో కాలుష్య కట్టడికి నిధుల వినియోగం సరిగ్గా జరగలేదు. నగరాల్లో టాప్ మూడు ముంబై రూ. 938 కోట్లు, కోల్‌కతా రూ. 846 కోట్లు, హైదరాబాద్ రూ. 551.05 కోట్లు, అత్యధికంగా నిధులు అందుకున్నాయి. క్రమంగా ఈ నగరాలు 60.2 శాతం, 79.6 శాతం, 73.8 శాతం, నిధులు వ్యయం చేశాయి.
ఈ నగరాల ఐదేళ్ల వార్షిక సరాసరి పిఎం 10 స్థాయిలు ఘనపు మీటర్ గాలిలో క్రమంగా 104, 99, 85 మైక్రోగ్రాముల వంతున ఉన్నాయి. ఫరీదాబాద్‌కు రూ.73 కోట్లు, ఘజయాబాద్‌కు రూ. 136 కోట్లు, ఢిల్లీకి రూ. 42 కోట్లు నిధులు అందాయి. ఈ నగరాలు క్రమంగా 38.9 శాతం, 97.8 శాతం, 29.5 శాతం వంతున ఖర్చు చేశాయి. ఇంతేకాకుండా 131 నగరాల్లో పిఎం 10 స్థాయిలు సరాసరిన 210, 204, 200 వంతున కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి వాయు నాణ్యతను కట్టడి చేయడం పెద్ద సవాలుగానే ఉంటోందని తెలుస్తోంది. అయితే నగరాలకు కేటాయించిన ఈ నిధులు చాలా వరకు 64 శాతం వంతున రోడ్డు దుమ్మును నివారించడానికే వినియోగించినట్టు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ 2024 జులై నివేదిక వెల్లడించింది. బయోమాస్ (పంట వ్యర్థాలు వంటివి) దహనాల నివారణకు 14.51శాతం, వాహనాల రంగానికి రూ. 12.63 శాతం, భవనాల కోసం రూ. 6 శాతం, 0.61 శాతం పారిశ్రామిక రంగానికి వెచ్చించారు.
ఉత్తరాది ప్రాంతాల్లో పంట మార్పిడి విధానాల వంటివి పంట వ్యర్థాలను మండించడాన్ని కొంతవరకు తగ్గించగలుగుతాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ చైర్ ప్రొఫెసర్ గుఫ్రాన్‌బేగ్ సూచించారు. పారిశ్రామిక కాలుష్యం నియంత్రణకు పర్యవేక్షక వ్యవస్థ, విధానపరమైన నిబంధనలు, ప్రమాణాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. రిజిస్టర్ కాని చిన్నతరహా పరిశ్రమలు నిబంధనలు పాటించడంలో విఫలమవుతున్నాయి. అంతేకాదు భారీ పరిశ్రమలు కూడా కాలుష్య నివారణ నిబంధనలు పాటించి తగిన చర్యలు తీసుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచం లోని అత్యంత కాలుష్య ఐదు నగరాల్లో నాలుగు దక్షిణాసియాలో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అవి లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. ఈ నగరాల పొలిమేరల్లోని పొలాల్లో ధాన్యాన్ని వేరు చేసిన తరువాత మిగిలిపోయిన గడ్డి వంటి వ్యర్థాలను తగులబెడుతుండడం వాయు కాలుష్య తీవ్రం కావడానికి దోహదమవుతోంది.
ఈ వ్యర్థాల మంట నుంచి వచ్చే పొగమసి గాలి సాంద్రతలో 40% వరకు పేరుకుపోతోంది. దీంతో గాలిచలన వేగం తగ్గి వర్షానికి కూడా ఆటంకం ఏర్పడుతోంది. గత నవంబర్‌లో పంట వ్యర్థాల దహనాలు ఢిల్లీని ఎంత ఉక్కిరిబిక్కిరి చేశాయో మనకు తెలిసిందే. పంజాబ్, హర్యానా, సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నిరాఘాటంగా సాగుతోంది. ఈ పంట దహనాలతో పాటు దీపావళి బాణసంచా కాల్పులతో ఢిల్లీతో సహా మొత్తం ఏడు నగరాల్లో కాలుష్య స్థాయి ఘనపు మీటర్‌కు 500 మైక్రోగ్రాముల స్థాయిని దాటేసింది. ఇదిలా ఉండగా ఢిల్లీలో మంగళవారం ఉదయం కాలుష్య స్థాయి 401 నుంచి 450 వరకు తీవ్ర కేటగిరీకి చేరుకుంది. అంతకు ముందు సోమవారం 294 స్థాయి రికార్డు అయింది. గత కొన్ని నెలలుగా ఢిల్లీ వంటి ఉత్తరాది నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో వెంటాడుతుండడం ప్రజారోగ్యంపై విపరీత ప్రభావం చూపిస్తోంది.