Friday, November 29, 2024

పశ్చిమాసియాకు ‘శాంతి’ ఊపిరి

- Advertisement -
- Advertisement -

ఏడాదికి పైగా యుద్ధంతో ఛిన్నాభిన్నమవుతున్న పశ్చిమాసియాలో మళ్లీ శాంతి, స్థిరత్వం నెలకొంటాయన్న ఆశ కలుగుతోంది. ఇజ్రాయెల్ హెజ్‌బొల్లాల మధ్య కాల్పుల విరమణకు తాత్కాలిక ఒప్పందం కుదరడం చెప్పుకోదగిన పరిణామం. ఈ ఒప్పందం బుధవారం తెల్లవారు జాము నుంచి అమలు లోకి వచ్చింది. దీంతో పశ్చిమాసియా కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. ఇజ్రాయెల్ దాడులు నిలిచిపోవడంతో లెబనాన్ రాజధాని బీరుట్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడులతో లెబనాన్‌లో సుమారు 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తమ ఇళ్లూ వాకిలి విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. వారంతా తిరిగి తమ నివాసాలకు చేరుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే దక్షిణ లెబనాన్‌లో ప్రవేశించడానికి ఇంకా అనుకూల పరిస్థితులు ఏర్పడలేదు. దక్షిణ లెబనాన్‌లో అనేక ప్రాంతాలను ఖాళీ చేయాలని గతంలో ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఇంకా అమలులో ఉన్నాయని ఇజ్రాయెల్ అరబిక్ మిలిటరీ చెబుతోంది. కానీ ఈ హెచ్చరికలను నిర్వాసితులు పట్టించుకోవడం లేదు. టైర్, పరిసర గ్రామాలకు అనేక మంది తిరిగి రావడం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ హెజ్‌బొల్లా మధ్య గత ఏడాది అక్టోబర్ నుంచి సాగుతున్న పోరాటంతో ప్రాణ నష్టమే కాదు, ఆస్తుల నష్టం కూడా అపారంగా సంభవించింది. ఈ పోరులో 4 వేలకు పైగా మృతి చెందగా, వీరిలో 3823 మంది లెబనాన్ వాసులే ఉన్నారు. అదీ కూడా సామాన్య పౌరులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 47 మంది సాధారణ పౌరులు మృతి చెందగా, 80 మందికి పైగా ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు.

హెజ్‌బొల్లా మిలిటెంట్లనే లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసినప్పటికీ, లెబనాన్‌లో ఆస్తి నష్టం 850 కోట్ల డాలర్ల వరకు సంభవించింది. దాదాపు లక్ష ఇళ్లు ధ్వంసమయ్యాయి. అటు ఇజ్రాయెల్‌లోనూ దాదాపు 5683 ఎకరాల మేర పంటలు, చెట్లు అగ్నికి బూడిదయ్యాయి. లెబనాన్‌లో 12 లక్షల మంది, ఇజ్రాయెల్‌లో 46,500 మంది తమ ప్రాణాలు కాపాడుకోడానికి ఇళ్లను వదిలి వెళ్లి సురక్షిత ప్రాంతా ల్లో తలదాచుకోవలసి వచ్చింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ బలగాలు సుమారు 14 వేల దాడులు చేయగా, ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా 2 వేలకు పైగా దాడులు చేసింది. అయితే గాజాపై ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగేటట్టు లేదు. ఇప్పటి వరకు గాజాలో ఇజ్రాయెల్ దాడుల వల్ల 44 వేల మంది ప్రాణాలు కోల్పోగా, మరో 1.04 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. మృతుల్లో 70% మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.

ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం గాజాలో మారణకాండకు కారణమైంది. అమానవీయ చర్యలతో పాటు, ఆకలిచావులు వంటి యుద్ధ నేరాలకు ఇజ్రాయెల్ పాల్పడినట్టు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) గుర్తించింది. అందుకనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్‌పై అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఈ అరెస్ట్ వారంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసిసిని ఆశ్రయించింది. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అయినా నెతన్యాహులో పశ్చాత్తాపం అన్నది కనిపించడం లేదు. పైగా ఐసిసినే బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తే ఐసిసి తమకు వ్యతిరేకంగా ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తుందో అమెరికాతో సహా తమ మిత్రదేశాకు తెలుస్తోందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా, లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సేనలు, హెజ్‌బొల్లా మూకల మధ్య పరస్పర దాడులు ఇక జరగకుండా తాజాగా తాత్కాలిక సంధి కుదిర్చామని, ఇది శాశ్వత విరమణకు నాంది పలుకుతుందన్న ఆశాభావాన్ని అమెరికా వెలిబుచ్చింది. యుద్ధాలతో ఎవరికీ భద్రత ఉండబోదని అమెరికా నీతి సూత్రాలు వల్లించడం రొయ్యల మొలతాడు కట్టుకున్న పిల్లి మంత్రాలు వల్లించినట్టు అవుతుంది.

గత ఏడాది కాలంలో ఇజ్రాయెల్ పోరుకు ఇంధనంగా దాదాపు 1800 కోట్ల డాలర్లను అమెరికా సమకూర్చడం దేనికోసమో అమెరికాయే సమాధానం చెప్పాల్సి ఉంది.అంతేకాదు గాజాపై దాడులు ముమ్మరం అయ్యాక బైడెన్ యంత్రాంగం యుద్ధ విరమణకు రాజీప్రయత్నాలు చేయలేదు సరికదా ఒక ఆయుధ వ్యాపారి పాత్ర వహించింది. దాదాపు వంద ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు వెల్లడైంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నా నివారించడానికి అమెరికా ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. పైగా ఉక్రెయిన్‌కు అండగా నిలిచి యుద్ధాన్ని రావణకాష్ఠంలా మారుస్తోంది. మరికొన్నిరోజుల్లో అధికార పీఠం నుంచి వైదొలగుతున్న సమయంలో బైడెన్ ప్రభుత్వం కీవ్‌కు మరింత ఆయుధ సాయం అందించడానికి సిద్ధమవుతోంది.

ట్రంప్ అధికారం చేపట్టక ముందే ఉక్రెయిన్‌ను బలోపేతం చేయాలన్న నిశ్చయంతో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ అధికారం చేపడితే ఉక్రెయిన్‌కు ఎలాంటి సాయం అందకపోవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల భయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 725 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించడానికి అమెరికా ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్యాకేజీలో ల్యాండ్‌మైన్స్, డ్రోన్లు, స్ట్రింగర్ క్షిపణులతోపాటు హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్‌ను అందించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా తన ఆయుధ నిల్వల కేంద్రంలో ఆయుధాలను, మందుపాతరలను ఉక్రెయిన్‌కు భారీగానే అందించింది. ఈ విధమైన పక్షపాత వైఖరితో యుద్ధాలను ఎగదోయడం కన్నా పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు ప్రయత్నించే బాధ్యత అమెరికాదే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News