కేరళలోని వయనాడ్ ఎంపీగా గురువారం లోక్‌సభలో ప్రమాణం చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నవంబర్ 30న(శనివారం) తన సోదరుడు రాహుల్ గాంధీతో కలసి వయనాడ్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. నియోజకవర్గం ఎంపీగా ఆమె ఇక్కడకు రావడం ఇదే మొదటిసారి అవుతుంది. మొదటిసారి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన ప్రియాంక గాంధీ ఇటీవల వయనాడ్ లోక్‌సభ ష్‌థానానికి జరిగిన ఉప ఎన్నికలో 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇదే నియోజకవర్గం నుంచి
పోటీ చేసిన రాహుల్ గాంధీ కన్నా అధిక మెజారిటీని ప్రియాంక సాధించడం విశేషం. కోజిక్కోడ్ జిల్లా తిరువంబాడి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ముక్కం వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం నీలాంబూర్‌లోని కరులై, ఇరనాడ్‌లోని వండూర్, ఎడవన్న వద్ద ప్రియాంకకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయని వారు చెప్పారు. కోజిక్కోడ్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మలప్పురం జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలు వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి.