ఫార్మా పరిశ్రమల ఏర్పాటు కోసం చేపట్టిన భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్లతో పాటు హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీల కోసం 1,358 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజీ బదులుగా మల్టీపర్పస్ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా భూసేకరణను ఉపసంహరించు కుంది. ఈ మేరకు లగచర్ల గ్రామంలో భూసేకరణను ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. లగచర్లలో ఫార్మా విలేజ్‌ల కోసం ఆగష్టు 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు, స్థానికులు ఆందోళన చేయగా వారికి ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. జరిగిన పరిణామాల దృష్టా ఫార్మా ఇండస్ట్రీ నిమిత్తం భూసేకరణ కోసం ఇచ్చిన నోటి ఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
1,358 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదనలు
ఫార్మా విలేజీల కోసం లగచర్లలో 632 ఎకరాలు, హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం జూన్ 7వ తేదీన టిజిఐఐసీ 1,358 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదనలు ఇచ్చింది. టిజిఐఐసీ ప్రతిపాదనల మేరకు పట్టా, అసైన్డ్ భూములను సేకరించేందుకు తాండూరు ఆర్డీఓను జూన్ 28వ తేదీన భూసేకరణ అధికారిగా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. పోలేపల్లిలో 71 ఎకరాలు, లగచర్లలో 632 ఎకరాల భూసేకరణకు జూలై, ఆగష్టులో అనుమతిచ్చారు.
త్వరలో మరో నోటిఫికేషన్
లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేసిన ప్రభుత్వం అక్కడే కొత్తగా ఇండస్ట్రీయల్ కారిడార్ భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఫార్మా కాకుండా వేరే కంపెనీలు అయితే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన కొత్త నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీయల్ పార్క్‌లో టెక్స్ టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పొల్యూషన్ ఉండదు, స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు
అయితే ఫార్మా పరిశ్రమలపై లగచర్లలో రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం దీనిని పునః సమీక్షించింది. అక్కడ పెట్టేది ఫార్మావిలేజీ కాదని పారిశ్రామిక జోన్ అని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం భూసేకరణ ఉప సంహ రించుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్ టిజిఐఐసీకి తెలియచేశారు. ఫార్మా విలేజీల బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు కోసం తాజాగా భూసేకరణ కోసం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఫార్మా సిటీ విలేజీల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌లను వెనక్కి తీసుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్ పత్రికల్లో ప్రకటనలు జారీ చేశారు. తాజాగా ఇండస్ట్రీయల్ పార్కు భూసేకరణ కోసం తాండూరు సబ్ కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు. త్వరలో భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.